Telugu Global
Andhra Pradesh

ఏపీ అప్పు రూ.4.42 లక్షల కోట్లే..

ఏపీ అప్పు వివరాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.

ఏపీ అప్పు రూ.4.42 లక్షల కోట్లే..
X

ఆంధ్రప్రదేశ్‌ అప్పు అదుపులోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏపీ అప్పు వివరాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రస్తుత అప్పు రూ.4,42,442 కోట్లుగా వెల్లడించారు.

2019తో పోలిస్తే దాదాపు రూ.1.78 లక్షల కోట్లు పెరిగింది. 2019లో ఏపీ అప్పు రూ.2,64,451 కోట్లుగా ఉండేది. 2020లో అది రూ.3,07,671 కోట్లకు చేరింది. 2021 నాటికి రూ.3,53,021 కోట్లుగా ఏపీ అప్పు ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2022 నాటికి అది రూ.3,93,718 కోట్లకు చేరింది. 2023 ప్రస్తుత బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుతానికి ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. ఏటా దాదాపుగా 45వేల కోట్ల వరకు ఏపీ అప్పు చేస్తోందన్నారు.

అయితే ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లకు చేరిందంటూ ఇటీవల పదేపదే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం విడుదల చేస్తున్న గణాంకాలను బట్టి చూస్తే మాత్రం ప్రతిపక్షాలు చెబుతున్న దానికి, వాస్తవానికి పొంతన ఉన్నట్టు కనిపించడం లేదు.

First Published:  7 Feb 2023 12:05 PM GMT
Next Story