Telugu Global
Andhra Pradesh

ఏపీలో రేషన్ వాహనాలకు సీసీ కెమెరాలు

గతంలో రేషన్ షాపుకి వెళ్లేవారు, ఇప్పుడు బండి దగ్గరకు వచ్చి నిలబడుతున్నారు. ఈ పద్ధతి మార్చేందుకు ఇకపై వాహనం కచ్చితంగా ప్రతి ఇంటికీ వెళ్లేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయంటున్నారు అధికారులు.

ఏపీలో రేషన్ వాహనాలకు సీసీ కెమెరాలు
X

ఏపీలో ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందిస్తున్న వాహనాలకు ఇకపై సీసీ కెమెరాలు బిగించబోతున్నారు. డిసెంబర్-1 నుంచి ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక వాహనానికి సీసీ కెమెరాలు అమరుస్తారు. ఆ తర్వాత వాటి సంఖ్యను క్రమంగా పెంచుతారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా చూసేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు అధికారులు. ఈ వాహనాలకు జీపీఎస్ పరికరం కూడా అమర్చుతారు.

ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారా..?

ఇంటివద్దకే రేషన్ అనే పద్ధతి విప్లవాత్మకం అని ప్రభుత్వం చెప్పుకుంటున్నా దానివల్ల ఏ మేరకు ప్రయోజనం అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. రేషన్ షాపు ముందు క్యూ ఉన్నట్టుగానే రేషన్ బండి ముందు కూడా క్యూలు కనపడుతున్నాయి. ఇంటి దగ్గరకు బండి వచ్చినప్పుడు లబ్ధిదారులు లేకపోతే రేషన్ ఇవ్వరు. గతంలో రేషన్ షాపుకి వెళ్లేవారు, ఇప్పుడు బండి దగ్గరకు వచ్చి నిలబడుతున్నారు. సరుకులు తీసుకెళ్తున్నారు. ఈ పద్ధతి మార్చేందుకు ఇకపై వాహనం కచ్చితంగా ప్రతి ఇంటికీ వెళ్లేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయంటున్నారు అధికారులు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వాహనం వెళ్లాలని, రోడ్డులో నిలబెట్టి రేషన్ సరుకులు ఇవ్వడం ఇకపై కుదరదని చెబుతున్నారు.

అయితే సీసీ కెమెరాలు అనేవి అదనపు ఖర్చేనంటున్నారు కొంతమంది. ఇప్పటికీ రేషన్ డీలర్ల కమిషన్ కొనసాగిస్తున్నారు. రేషన్ వాహనం ఆపరేటర్ కి ఇచ్చే జీతం దీనికి అదనం. ఇలా ఈ పథకానికి ఖర్చు తడిసి మోపెడవుతోందని, దాని బదులు నాణ్యమైన బియ్యం ఇస్తే చాలనే వాదన కూడా వినపడుతోంది. మరి సీసీ కెమెరాలతో ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూడాలి.

First Published:  23 Nov 2022 3:34 AM GMT
Next Story