Telugu Global
Andhra Pradesh

రఘురామ రాజుకు షాక్.. సీబీఐ వేట మొదలు

రెండో సారి పార్లమెంట్ కి, వీలైతే ఏపీ అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్న టీడీపీ నేత రఘురామకృష్ణంరాజుకి కష్టకాలం మొదలైంది. రూ.974 కోట్ల మేర బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో ఆయనకు సీబీఐ ఉచ్చు బిగిస్తోంది.

రఘురామ రాజుకు షాక్.. సీబీఐ వేట మొదలు
X

ఎంపీ టికెట్ పోయింది, అసెంబ్లీ టికెట్ కూడా దొరుకుతుందో లేదో అనుమానమే. ఈ దశలో టీడీపీ నేత రఘురామకృష్ణంరాజుకి కొత్త చిక్కులు మొదలయ్యాయి. పాత కేసులో సీబీఐ ఆయనకు షాకిచ్చింది. ఆయనపై ఉన్న కేసు దర్యాప్తుపై ఉన్న స్టేను ఎత్తివేయాలని సీబీఐ సుప్రీంకోర్టుని కోరింది. ఈ స్టే ఎత్తివేస్తే దర్యాప్తు ముమ్మరం అవుతుంది, రఘురామ అరెస్ట్ తప్పదు.

అసలేంటి కేసు..?

రఘురామ కృష్ణంరాజు బ్యాంకులను వందలకోట్లకు ముంచేశారు. బ్యాంకులను మోసం చేసి రుణం తీసుకుని, సకాలంలో చెల్లించకుండా చేతులెత్తేశారు. పోనీ ఆ రుణాలను ఎక్కడైనా పెట్టుబడులుగా పెట్టి వ్యాపారంలో నష్టపోయారా అంటే అదీ లేదు. కేవలం బ్యాంకుల్ని మోసం చేయడానికే తీసుకున్న రుణాలు అవి. ఇండ్ -భారత్‌ కంపెనీ పేరుతో థర్మల్‌ పవర్‌ కంపెనీ ఏర్పాటు చేసేందుకు బ్యాంకుల నుంచి రూ.974 కోట్లు రుణం తీసుకున్నారాయన. అయితే కంపెనీ పెట్టకుండా పెద్ద గేమ్ ఆడారు. ఆ అప్పుని తీసుకెళ్లి వివిధ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారు రఘురామరాజు. అలా ఫిక్స్డ్ చేసిన సొమ్ముపై తిరిగి ఆయా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు. వాటిని దారి మళ్లించారు. ఈ మోసం చూసి అప్పులిచ్చిన బ్యాంకులు షాకయ్యాయి. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే దర్యాప్తు ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు రఘురామకృష్ణంరాజు. దీంతో విచారణ కాస్త ఆలస్యమైంది.

ఈ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నాన్‌ మిసిలేనియస్‌ రోజుల్లో విచారణ జరిపాలని కోరారు. దీంతో, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు. దర్యాప్తుపై స్టే ఎత్తివేయాలని సీబీఐ కోర్టుని కోరింది. బ్యాంకులకు రుణం ఎగవేత కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పింది. ఈ దర్యాప్తు మొదలైతే.. రఘురామరాజు అరెస్ట్ తప్పదని అంటున్నారు.

First Published:  15 April 2024 11:27 AM GMT
Next Story