Telugu Global
Andhra Pradesh

అవినాష్ రెడ్డి.. లొంగిపో.. కర్నూలులో సీబీఐ

జిల్లా ఎస్పీ ద్వారా అవినాష్‌ రెడ్డి ఆలోచన ఏంటన్నది తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అవినాష్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోతే అరెస్ట్‌ చేసి తీసుకెళ్లే యోచనలో సీబీఐ అధికారులు ఉన్నారు.

అవినాష్ రెడ్డి.. లొంగిపో.. కర్నూలులో సీబీఐ
X

ఏ క్షణంలోనైనా ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లికి గుండెపోటు రావడంతో సీబీఐ విచారణకు హాజరుకాని అవినాష్ రెడ్డి మూడు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలోనే ఉన్నారు. సోమవారం విచారణకు రావాల్సి ఉండగా మరోసారి తాను రాలేనని అవినాష్ చెప్పేశారు. దాంతో తెల్లవారుజామునే సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారు. అవినాష్ రెడ్డిని లొంగిపోవాల్సిందిగా సీబీఐ కోరింది.

ఈమేరకు సహకారం అందించాల్సిందిగా కర్నూలు ఎస్పీని సీబీఐ అధికారులు సంప్రదించారు. ఆస్పత్రి వద్ద భారీగా అవినాష్ రెడ్డి అనుచరులు ఉండడం, రాత్రి వారు మీడియాపై దాడి చేసిన నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల ఇబ్బంది రాకుండా చూడాలని జిల్లా ఎస్పీని కోరారు. ఆస్పత్రి వద్ద దుకాణాలను పోలీసులు మూసివేయించారు. వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించివేశారు.

జిల్లా ఎస్పీ ద్వారా అవినాష్‌ రెడ్డి ఆలోచన ఏంటన్నది తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అవినాష్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోతే అరెస్ట్‌ చేసి తీసుకెళ్లే యోచనలో సీబీఐ అధికారులు ఉన్నారు. పదేపదే విచారణకు డుమ్మా కొట్టడంతో సీబీఐ దీన్ని పరువు సమస్యగా తీసుకుంటోంది.

వైద్యులు మాత్రం అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ఆమెకు బీపీ తక్కువగా ఉందని మరికొన్ని రోజులు ఐసీయూలోనే ఉంచాలని చెబుతున్నారు. గుండె సమస్య ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి తాను విచారణకు హాజరయ్యేందుకు మరో 10 రోజులు గడువు ఇవ్వాలని సీబీఐని కోరారు.

First Published:  22 May 2023 4:54 AM GMT
Next Story