Telugu Global
Andhra Pradesh

గూగుల్ టేకౌట్‌ను వదిలేసినట్లేనా? దిక్కులు చూస్తున్న సీబీఐ

వివేకా హత్యలో నిజంగా అవినాష్ పాత్ర ఉంటే శిక్షించాల్సిందే అనటంలో సందేహం లేదు. అయితే అందుకు తగ్గ ఆధారాలను సేకరించాలి కదా. అవినాష్ మీద సీబీఐ చేసిన ఆరోపణలపై జడ్జి వ్య‌క్తప‌రిచిన‌ సందేహాల్లో దేనికీ సీబీఐ వ‌ద్ద‌ సమాధానం లేకపోయింది.

గూగుల్ టేకౌట్‌ను వదిలేసినట్లేనా? దిక్కులు చూస్తున్న సీబీఐ
X

ఒక‌ప్పుడు ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేస్తోందంటే జనాలు చాలా గొప్పగా చెప్పుకునేవారు. అలాంటిది ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అంటే అందరికీ నవ్వులాటైపోయింది. సీబీఐ కన్నా మామూలు పోలీసులే చాలా నయమనే స్థాయికి దాని పనితీరు పడిపోయింది. వివేకానందరెడ్డి మర్డర్ కేసు దర్యాప్తులో సీబీఐ వ్యవహారం, దర్యాప్తులో లోపాలు బయపడుతుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేసును సీబీఐ ఇంత నిర్లక్ష్యంగా దర్యాప్తు చేస్తోందా అని జనాలు నవ్వుకుంటున్నారు.

వివేకా మర్డర్‌లో పాత్రదారులెవరు, సూత్రదారులెవరు? అన్న విషయాలను ఆధారాలతో సహా కోర్టులో నిరూపించాల్సిన సీబీఐ ఎంతకాలమైనా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలా ఇరికించాలా? అని మాత్రమే ప్రయత్నిస్తోంది. హత్యలో నిజంగా అవినాష్ పాత్ర ఉంటే శిక్షించాల్సిందే అనటంలో సందేహం లేదు. అయితే అందుకు తగ్గ ఆధారాలను సేకరించాలి కదా. అవినాష్ మీద సీబీఐ చేసిన ఆరోపణలపై జడ్జి వ్య‌క్తప‌రిచిన‌ సందేహాల్లో దేనికీ సీబీఐ వ‌ద్ద‌ సమాధానం లేకపోయింది.

వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాష్ ఫిర్యాదు చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అన్న జడ్జి ప్రశ్నకు లేదని సమాధానమిచ్చింది. ఫిర్యాదు చేసింది అవినాష్ కాదని వివేకా అల్లుడని చెప్పింది. వివేకా దేహాన్ని తొందరగా తరలించాలని అవినాష్ చెప్పారా అంటే లేదు వివేకా అల్లుడు చెప్పటంతో తరలించారని సీబీఐ బదులిచ్చింది. ఇంతకాలం హత్యా ప్రదేశంలో రక్తాన్ని తుడిచేసి సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నంచేశారంటు అవినాష్, ఆయన తండ్రి భాస్కరరెడ్డి మీద సీబీఐ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

శరీరం మీద గాయాలున్నపుడు నేలపైన ఉన్న రక్తం తుడిస్తే నష్టమేమిటి? అన్న జడ్జి ప్రశ్నకు సీబీఐ నష్టమేమీ లేదన్నది. నష్టమేమీ లేనప్పుడు ఇంతకాలం సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేసినట్లు సీబీఐ ఎలా ఆరోపించారంటే సమాధానం చెప్పలేదు. అవినాష్ తెల్లవారుజామున వాట్సప్ కాల్స్ ఎవరికి చేశారో తెలుసా అంటే తెలియ‌దు అన్న‌ది. ఎంపీ సాక్ష్యులను బెదిరిస్తున్నారు కాబట్టి బెయిల్ ఇవ్వకూడదన్నది సీబీఐ వాదన. తమను ఎంపీ బెదిరిస్తున్నారని ఎంతమంది ఫిర్యాదు చేశారని జడ్జి అడిగితే ఎవరు ఫిర్యాదు చేయలేదని చెప్పింది.

వివేకా హత్య తర్వాత హంతకుల్లో ఒకళ్ళిద్దరు అవినాష్ ఇంట్లో ఉన్నారనేందుకు గూగుల్ టేకౌట్ సాక్ష్యమని ఇంతకుముందు వాదించింది. ఆ టెక్నాలజీ సరైన ఆధారంగా పనికిరాదని కోర్టు కొట్టేసింది. దాంతో గూగుల్ టేకౌట్‌ను వదిలేసి కొత్తగా ఐపీడీఆర్(ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డ్స్) అన్నదాన్ని పట్టుకుంది. దీన్ని కూడా కోర్టు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. దాంతో సీబీఐకి ఏంచెప్పాలో అర్థంకాక దిక్కులు చూస్తోంది.

First Published:  29 May 2023 5:43 AM GMT
Next Story