Telugu Global
Andhra Pradesh

అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు.. ఈసారి విచారణ ఎప్పుడంటే...

అయితే ఈసారి ఏం జరుగుతుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అవినాష్ విచారణకు వెళ్తే ఈసారి అరెస్ట్ ఖాయమని భావిస్తున్నారు. విచారణకు పిలిచిన రోజు రావడం లేదన్న విమర్శ ఇప్పటికే అవినాష్ రెడ్డిపై ఉంది.

అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు.. ఈసారి విచారణ ఎప్పుడంటే...
X

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐకి మధ్య దోబూచులాట కొనసాగుతోంది. శుక్రవారం అవినాష్ రెడ్డి విచారణకు రావాల్సి ఉంది. అయితే తన తల్లి గుండెపోటుకు గురవడంతో ఆయన ఆఖరి క్షణంలో హాజరు కాలేకపోయారు. ఆ సందర్భంగా పెద్ద హైడ్రామా నడిచింది. తల్లి కోసం వెళ్తున్న అవినాష్ రెడ్డిని మీడియా వెంబడించడం.. ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు కొందరు మీడియా ప్రతినిధులు కొట్టడం కూడా జరిగింది.

ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్నారు. ఆ ఆస్పత్రి యజమాని అల్లుడైన హితేష్ రెడ్డిది పులివెందుల నియోజకవర్గమే. హితేష్ రెడ్డి పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలోనూ వారంలో ఒకరోజు వైద్య సేవలు అందిస్తుంటారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తన తల్లితో పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపింది. ఈనెల 22న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది.

అయితే ఈసారి ఏం జరుగుతుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అవినాష్ విచారణకు వెళ్తే ఈసారి అరెస్ట్ ఖాయమని భావిస్తున్నారు. విచారణకు పిలిచిన రోజు రావడం లేదన్న విమర్శ ఇప్పటికే అవినాష్ రెడ్డిపై ఉంది. అడిగిన గడువు ఇచ్చినా సరే.. తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయంటూ ఇప్పటి వరకు నాలుగు సార్లు టైమింగ్ మార్చేలా అవినాష్ రెడ్డి చేశారు. ఈనెల 16న రావాల్సిందిగా నోటీసులు ఇవ్వగా విచారణకు రావాల్సిన రోజు ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు ఉన్నాయంటూ పులివెందుల వెళ్లిపోయారు. కొన్ని రోజుల గడువు కావాలని కోరగా ఈనెల 19న రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. తల్లికి గుండెపోటు కారణంగా నిన్న రాలేదు.

ఈసారి తప్పక హాజరు కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి డుమ్మా కొడితే దాన్ని సాకుగా చూపి సీబీఐ అరెస్ట్ చేసేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. పైగా ఇలా విచారణకు పదేపదే విముఖత చూపడంతో ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.

First Published:  20 May 2023 8:33 AM GMT
Next Story