Telugu Global
Andhra Pradesh

జడ్జిలపై పోస్టులు, మరో ఏడుగురు అరెస్ట్

విచారణకు పిలిచినా వీరంతా సహకరించడం లేదని అందుకే అరెస్ట్ చేసినట్టు సీబీఐ వెల్లడించింది. నిందితులకు కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. అనంతరం విజయవాడలోని జిల్లా జైలుకు వీరిని తరలించారు.

జడ్జిలపై పోస్టులు, మరో ఏడుగురు అరెస్ట్
X

న్యాయమూర్తులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మరో ఏడుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని సోమవారం విజయవాడలో సీబీఐ కేసులు విచారించే కోర్టు ముందు హాజరుపరిచారు. అరెస్ట్ అయినవారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. నరసరావుపేటకు చెందిన ప్రదీప్‌ కుమార్ రెడ్డి, కుంచనపల్లివాసి అశోక్‌ కుమార్ రెడ్డి, భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన రంగారావు, నంబూరు గ్రామస్తురాలైన సుమ, ప్రకాశం జిల్లా గురజపేటకు చెందిన గంజికుంట మల్లికార్డునరావు, హైదరాబాద్ వాసి చొక్కా రవీంద్రలను సీబీఐ అరెస్ట్ చేసింది.

విచారణకు పిలిచినా వీరంతా సహకరించడం లేదని అందుకే అరెస్ట్ చేసినట్టు సీబీఐ వెల్లడించింది. నిందితులకు కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. అనంతరం విజయవాడలోని జిల్లా జైలుకు వీరిని తరలించారు. ఉద్దేశపూర్వకంగానే న్యాయమూర్తులపై వీరు అనుచిత పోస్టులు పెట్టారని సీబీఐ ఆరోపించింది. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని దాన్ని చేధించాల్సిన అవసరం ఉందని కాబట్టి నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును సీబీఐ కోరింది.

హిందూపురం వైసీపీ కౌన్సిలర్ మారుతీరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ పోలీసులు రాగా అప్పటికే ఆయన పారిపోయారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా మారుతీరెడ్డి విచారణకు రాకపోవడంతో ఆరుగురు సీబీఐ అధికారులు అతడిని అరెస్ట్ చేసేందుకు వచ్చారు. మారుతీరెడ్డి లేకపోవడంతో అతడి భార్యతో మాట్లాడిన సీబీఐ అధికారులు కొన్ని అంశాలపై వివరాలను తీసుకుని వెళ్లిపోయారు. న్యాయమూర్తులను దూషించిన కేసులో ఇప్పటి వరకు సీబీఐ మొత్తం 18 మందిని అరెస్ట్ చేసింది. వారిలో కొందరు కొన్ని నెలల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.

First Published:  13 Sep 2022 6:27 AM GMT
Next Story