Telugu Global
Andhra Pradesh

యూనివ‌ర్సిటీ పేరు మార్చినంత ఈజీగా 3 రాజధానులు చేయలేరా.. ?

మూడు రాజధానుల కోసం ప్రభుత్వం ఎందుకింత కష్టపడుతోంది. ఏకంగా మంత్రులు సైతం రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. నాన్ పొలిటికల్ జేఏసీ సపోర్ట్ తీసుకుని గర్జనలు చేయాల్సిన అవసరం అసలేంటి..?

యూనివ‌ర్సిటీ పేరు మార్చినంత ఈజీగా 3 రాజధానులు చేయలేరా.. ?
X

ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఇటీవల ఏపీలో బాగా హైలైట్ అయింది. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినా, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసనలు, ఆందోళనలు వారం రోజుల్లో చల్లబడ్డాయి, కోర్టులో సవాల్ చేసే సాహసం కూడా ఎవరూ చేయలేదు. అక్కడితో ఆ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడింది. 151మంది ఎమ్మెల్యేల బలమున్న వైసీపీ తలచుకుంటే జిల్లాల విభజన, జిల్లాలకు కొత్త పేర్లు, యూనివర్శిటీల పేరు మార్పు, లిక్కర్ పాలసీల మార్పు, టిడ్కో ఇళ్లకు రంగుల మార్పు.. ఇలాంటి వన్నీ చాలా తేలికగా జరిగిపోతాయి. మరి మూడు రాజధానులకోసం ప్రభుత్వం ఎందుకింత కష్టపడుతోంది. ఏకంగా మంత్రులు సైతం రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. నాన్ పొలిటికల్ జేఏసీ సపోర్ట్ తీసుకుని గర్జనలు చేయాల్సిన అవసరం అసలేంటి.. ?

అప్పుడంటే శాసన మండలిలో బలం లేక బిల్లు వెనక్కి వచ్చిందనుకోవచ్చు, ఆ కోపంలో మండలినే రద్దుచేస్తామన్నారు, రాజకీయ పునరావాస కేంద్రం తీసేస్తే మొదటికే మోసం వస్తుందని వెనక్కి తగ్గారు. మరిప్పుడు మండలిలో బలం ఉంది కదా ఇప్పుడెందుకు బిల్లు పెట్టి పాస్ చేయించుకోలేరు. కేంద్రం కూడా మా పరిధిలో ఏమీ లేదని చేతులెత్తేసింది కదా.. ? ఇంకెందుకాలస్యం..? ఒకవేళ అమరావతిని కూడా అభివృద్ధి చేయండి అని కోర్టు ఏడాది గడువిస్తే 364వ రోజు టైమ్ లేదు అని పిటిషన్లు వేయడం కూడా అలవాటైపోయింది కదా.. ఇంకెందుకీ ముసుగులో గుద్దులాట..?

ఎన్నికల అజెండా..?

రాజధాని విషయంలో టీడీపీది ఒప్పు, వైసీపీది తప్పు అని ఎవరూ చెప్పరు. కానీ టీడీపీ చేసిన తప్పునే వైసీపీ కూడా చేయాలనుకోవడం పెద్ద తప్పు. ఐదేళ్లలో టీడీపీ అమరావతికోసం ఏం చేసిందో.. మూడు రాజధానులన్న వైసీపీ మూడున్నరేళ్లలో విశాఖ, కర్నూలుకు అంతకంటే ఏమాత్రం ఎక్కువ చేయలేదు. ఏ మోతాదులో ఏం చేశారో విశాఖ, కర్నూలు వాసులకి కూడా బాగా తెలుసు. కానీ ఎన్నికలకు ఏదో ఒక కారణం కావాలి. ఓట్లు అడగాలంటే వచ్చేసారి తాము ఏం చేస్తామనేది చెప్పాలి. అందుకే మూడు రాజధానుల అజెండా.

విశాఖకు రాజధాని కావాలంటూ విశాఖ నుంచి గర్జన చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అధికార పార్టీ నేతలు తలుచుకుంటే జన సమీకరణ అసాధ్యమేమీ కాదు. కానీ అధికారంలో ఉన్న నేతలు, ఒక్క సంతకంతో అన్నీ మార్చేయగల నేతలు కూడా ఇలా ప్రజల మద్దతు కావాలి, ప్రజలు పోరాటంలో భాగస్వాములు కావాలి, ఉక్కు పిడికిళ్లు బిగించాలి అని పిలుపునివ్వడమే కాస్త హాస్యాస్పదంగా ఉంది. ఆఫ్ట్రాల్ 23 సీట్లు, అందులోనూ నలుగురు మిస్సయిన టీడీపీని చూసి సవాళ్లు విసరడం ఏంటి.. సింగిల్ సీటు కూడా లేని జనసేనపై రంకెలేయడం దేనికి..? అత్తగారింటిని రాజధానిగా చేస్తుంటే చూసి ఓర్చుకోలేరెందుకని పవన్ కల్యాణ్ ని ప్రశ్నిస్తున్న మంత్రివర్యులు.. అత్తగారి ఊళ్లకు ఎవరెవరు ఏయే మేళ్లు చేశారో చెప్పగలరా.. ? వైసీపీ ముందు ప్రస్తుతం రెండే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బలంతో మూడు రాజధానులు చేసి సత్తా నిరూపించుకోవ‌డమా.. ? లేక వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఇస్తే, సంబంధం లేకపోయినా కేంద్రం మెడలు వంచి మూడు రాజధానులు సాధిస్తామంటూ ఎన్నికలకోసం ప్రచారం చేసుకోవడమా..?

First Published:  16 Oct 2022 2:34 AM GMT
Next Story