Telugu Global
Andhra Pradesh

ఫ్యాన్‌దే ప్రభంజనమా..? నమ్ముకుంటే అంతేనా..?

క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఇవే పరిస్థితులు ఉన్నాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. సర్వేలో ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీచేస్తే రాబోయే ఫలితాలన్నట్లుగా టైమ్స్ నౌ ప్రకటించింది.

ఫ్యాన్‌దే ప్రభంజనమా..? నమ్ముకుంటే అంతేనా..?
X

ప్రముఖ మీడియా సంస్థ‌ టైమ్స్ నౌ ఇటీజీ విడుదల చేసిన సర్వే ఫలితాల్లో వైసీపీకి 24 ఎంపీ స్థానాలు వస్తాయని తేలింది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్నిస్థానాలు వస్తాయనే అంశంపై టైమ్స్ నౌ సర్వే చేసింది. ఇందులో వైసీపీ 24 లేదా 25 పార్లమెంటు సీట్లను గెలుచుకుంటుందని సర్వే చెప్పింది. టీడీపీ ఎక్కడైనా ఒక సీటు గెలుచుకునే అవకాశముందని తేలింది. ఇక జనసేన అసలు బోణీ కూడా కొట్టే అవకాశంలేదని ఫైనల్ అయ్యిందట.

గడచిన ఐదేళ్ల‌ల్లో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలన కారణంగానే జగన్ కు జనాలు అపారమైన మద్దతు ఇస్తున్నట్లు మీడియా సర్వేలో బయటపడిందట. ఫ్యాన్ ప్రభంజనం ముందు టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ కొట్టుకుపోవటం ఖాయమని కూడా తేలినట్లు మీడియా ప్రకటించింది. ఈ సర్వే జోస్యాన్ని చూస్తే వైసీపీ నేతలు, శ్రేణులకు బూస్టర్ డోసుగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని అర్థ‌మవుతోంది.

అయితే క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఇవే పరిస్థితులు ఉన్నాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. సర్వేలో ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీచేస్తే రాబోయే ఫలితాలన్నట్లుగా టైమ్స్ నౌ ప్రకటించింది. అందుకనే వైసీపీ, టీడీపీ, జనసేనలు విడిగా పోటీచేస్తే ఫ్యాన్ పార్టీకి 24 సీట్లు వస్తాయని చెప్పింది. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులో పోటీ చేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చాలాసార్లు ప్రకటించారు.

మరి టైమ్స్ నౌ మాత్రం వైసీపీ, టీడీపీ, జనసేనలు విడివిడిగా పోటీచేస్తాయని ఎలా అనుకున్నది. పై మూడు పార్టీలు విడివిడిగా పోటీచేస్తే అన్న ప్రాతిపదక మీద సర్వే చేయటంలో అర్థంలేదు. టీడీపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్నప్పుడు విడివిడిగా పోటీచేస్తే అన్న సర్వేనే తప్పు. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ+జనసేన కలిసి పోటీచేస్తే ఫలితాలు ఎలాగుంటాయనే అంశం ఆధారంగా సర్వే చేస్తే అప్పుడు ఫలితాలు తేడాగా ఉంటుందేమో. మొత్తంమీద ఇలాంటి సర్వేలను నమ్ముకుంటే వైసీపీ సంగతి అంతే సంగతులు.

First Published:  14 Dec 2023 5:01 AM GMT
Next Story