Telugu Global
Andhra Pradesh

కాల్ రికార్డులు నేతల కొంపముంచేస్తున్నాయా?

నేతల ఫోన్లలోని ఆడియో, వీడియోలు లీకై వాళ్ళ రాజకీయ జీవితాలే ప్రమాదంలో పడేట్లుగా చేస్తున్నాయి. తాజాగా నారా లోకేష్ పాదయాత్రకు వందలాది వెహికల్స్ ను ఏర్పాటుచేసి నాలుగు రోజుల పాటు జనాలను తోలుకొచ్చే ఏర్పాటు చేసినట్లు ఒక నేత టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో చెప్పిన మాటలు లీక్ అయ్యాయి.

కాల్ రికార్డులు నేతల కొంపముంచేస్తున్నాయా?
X

టెక్నాలజీ అన్నది పదునైన కత్తిలాంటిది. చాలామంది కత్తిని కూరగాయలు కట్ చేసేందుకు ఉపయోగిస్తుంటే కొందరేమో పీకలు కోసేందుకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే మొబైల్ ఫోన్లలోని కాల్ రికార్డింగ్‌ టెక్నాలజీ కొందరు నేతల భవిష్యత్తును మార్చేస్తోంది. నేతల ఫోన్లలోని ఆడియో, వీడియోలు లీకై వాళ్ళ రాజకీయ జీవితాలే ప్రమాదంలో పడేట్లుగా చేస్తున్నాయి. తాజాగా నారా లోకేష్ పాదయాత్రకు వందలాది వెహికల్స్ ను ఏర్పాటుచేసి నాలుగు రోజుల పాటు జనాలను తోలుకొచ్చే ఏర్పాటు చేసినట్లు ఒక నేత టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో చెప్పిన మాటలు లీక్ అయ్యాయి.

అచ్చెన్న-భీమినేని చిట్టిబాబు మధ్య ఫోన్ సంభాషణలు ఎలా లీకయ్యాయి? ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ ఫోన్ నుండే విషయం బయటకొచ్చాయన్నది వాస్తవం. ఆ వచ్చింది ఎవరి ఫోన్ నుండి ? అన్నదే అసలు పాయింట్. అసలే పాదయాత్ర, బహిరంగసభలకు జనాలు రావటంలేదని చంద్రబాబునాయుడు, లోకేష్ నానా ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్ర ఫెయిల్యూర్ అని నెగిటవ్ ప్రచారం పెరిగిపోతోంది. ఈ సమయంలో జనాలను బయట ప్రాంతాల నుండి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశానని చిట్టిబాబు చెప్పటం సంచలనంగా మారింది.

ఫోన్ సంభాషణ లీకవ్వటంలో చిట్టిబాబుకు పోయేదేమీ లేదుకానీ సమస్యంతా అచ్చెన్నకే చుట్టుకుంది. ఎందుకంటే గతంలో కూడా ఒక సందర్భంలో ‘పార్టీ లేదు బొక్కా లేదు.. పార్టీ పని అయిపోయింది’ అని అచ్చెన్న అన్నమాటలు ఎంత సంచలనమ‌య్యాయో అందరికీ తెలిసిందే. అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తన సన్నిహితుడితో మాట్లాడిన మాటలు లీకవ్వటంతో ఎంత గోల జరుగుతుందో అందరు చూస్తున్నదే. లీకైన ఆడియోను ట్యాపింగ్ అనుకుని దాన్నే తానే బయటపెట్టి సమస్యల్లో చిక్కుక్కున్నారు. వివాదానికి మూల కారణమైన కాల్ రికార్డింగ్ దెబ్బకు కోటంరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థ‌కమైపోయింది.

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆ మధ్య ఇసుక లారీలను పట్టుకున్నారని ఒక ఇన్‌స్పెక్ట‌ర్‌కు ఫోన్ చేసి తిట్టిన తిట్లు లీకవ్వటంతో పెద్ద రచ్చే జరిగింది. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులకు ఫోన్ చేసి బూతులు తిట్టారు. ఆ ఆడియో లీకవ్వటంతో చివరకు కేసు నమోదై అరెస్ట్ అయ్యారు. ఆ మధ్య పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్థితి నానాటికీ అధ్వాన్నమైపోతోందన్నారు. పార్టీని బలోపేతం చేయటానికి తాను అవస్తలు పడుతుంటే కొందరు నేతలు పార్టీ ఆఫీసుకొచ్చి డ్రామాలాడుతున్నారా అంటూ మండిపోయారు. ఆ వీడియో, ఆడియో కూడా లీకై పార్టీలో సంచలనమైంది.

First Published:  10 Feb 2023 6:08 AM GMT
Next Story