Telugu Global
Andhra Pradesh

ఏపీలోనూ కేబుల్ బ్రిడ్జ్.. దుర్గం చెరువే ఆదర్శం..

మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్‌ వంతెనకు టెండర్లు పిలుస్తుంది. టెండర్లు, వర్క్ ఆర్డర్లు ఖరారయ్యాక రెండేళ్ల కాలంలో ఇది అందుబాటులోకి వస్తుందని అంటున్నారు అధికారులు.

ఏపీలోనూ కేబుల్ బ్రిడ్జ్.. దుర్గం చెరువే ఆదర్శం..
X

హైదరాబాద్ లో దుర్గం చెరువు అంటే అప్పట్లో అది ఓ ప్రాంతం మాత్రమే, కానీ అదిప్పుడు ఐకానిక్‌ కేబుల్ బ్రిడ్జ్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కేబుల్ బ్రిడ్జ్ పై ప్రయాణం గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. ప్రమాదం అని తెలిసినా అక్కడ సెల్ఫీలకోసం యువత ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. అలాంటి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ని ఏపీలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కృష్ణానదిపై సోమశిల వద్ద దీన్ని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్మిస్తుంది.

కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్‌ వంతెనకు టెండర్లు పిలుస్తుంది. టెండర్లు, వర్క్ ఆర్డర్లు ఖరారయ్యాక రెండేళ్ల కాలంలో ఇది అందుబాటులోకి వస్తుందని అంటున్నారు అధికారులు.

పైన క్యారేజ్ వే, కింద పెడస్ట్రియన్ డెక్..

ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్‌ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లేందుకు గాజు వంతెన (పెడస్ట్రియన్‌ డెక్‌) ఏర్పాటు చేస్తారు. 800 మీటర్ల పొడవున దీన్ని నిర్మిస్తారు. దీనికోసం రూ.1,082 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దుర్గం చెరువు, మానేరుపై ఉన్న సస్పెన్షన్‌ వంతెనల తరహాలో సోమశిల వద్ద కేబుల్‌ బ్రిడ్జి నిర్మించబోతున్నారు. నంద్యాల, తిరుపతి మధ్య దీని ద్వారా 90కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండా భారీ పైలాన్‌ లు నిర్మిస్తారు. ఒక్కో పైలాన్‌ కు రెండు వైపులా 30 జతల భారీ కేబుల్స్‌ ఏర్పాటు చేసి, వాటి ఆధారంగా వంతెన నిలిచేలా నిర్మాణం పూర్తి చేస్తారు. ప్రస్తుతం తెలంగాణ వాసులు తిరుపతివైపు వెళ్లాలంటే కర్నూలుని టచ్ చేస్తూ చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తున్నారు.

First Published:  8 Oct 2022 3:26 AM GMT
Next Story