Telugu Global
Andhra Pradesh

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. వైజాగ్‌లో బీఆర్ఎస్ భారీ సభ?

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇప్పటికే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. వైజాగ్‌లో బీఆర్ఎస్ భారీ సభ?
X

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. గత కొన్నాళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ గళం విప్పింది. మంత్రి కేటీఆర్ స్వయంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. మోడీ తన కార్పొరేట్ మిత్రులకు ఈ స్టీల్ ప్లాంట్‌ను కట్టబెట్టే పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్‌ను అప్పనంగా ప్రైవేట్‌పరం చేసే కుట్రలను ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇప్పటికే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించారు. కేంద్రం చేస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక పాలనపై ఇప్పటికే పలు మార్లు బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది. సీఎం కేసీఆర్ కూడా మోడీ ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణను వ్యతిరేకించాలని, కార్మికులకు బాసటగా నిలవాలని నిర్ణయించారు.

వైజాగ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ.. బీఆర్ఎస్‌కు ఏపీలో తొలి సభ కానున్నది. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలో నిర్వహించిన సభలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయి. ఇక ఇప్పుడు వైజాగ్ సభను కూడా విజయవంతం చేయడానికి ఏపీ బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ సభలో కేసీఆర్ కూడా పాల్గొంటారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్, ఇతర నేతలు సభ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ నెలలోనే వైజాగ్ సభ ఉండే అవకాశం ఉందని ఏపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

స్టీల్ ప్లాంట్‌ కార్మికులకు మద్దతుగా పోరాడటం వల్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది. సింగరేణి కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 8న ధర్నాలు చేయనున్నది. గతంలో కూడా పార్టీ కార్మికోద్యమాల్లో పాల్గొన్న చరిత్ర ఉన్నది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం కూడా గట్టిగా పోరాటం చేయాలని కేసీఆర్ ఏపీ కమిటీకి ఇప్పటికే సూచించారు. కేవలం స్టీల్ ప్లాంట్ కోసమే కాకుండా.. కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ గళాన్ని మరింతగా వినిపించడానికి వైజాగ్ సభ ఉపయోగపడనున్నది.

First Published:  7 April 2023 3:22 AM GMT
Next Story