Telugu Global
Andhra Pradesh

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ పార్టీనే : తోట చంద్రశేఖర్

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థపై పట్టులేదని.. మనం ఎన్నో సమస్యలకు ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నామని చంద్రశేఖర్ అన్నారు.

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ పార్టీనే : తోట చంద్రశేఖర్
X

దేశంలో రైతాంగ సమస్యలు అలాగే ఉన్నాయని, నిరుద్యోగం కూడా పెరిగిపోతోందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరం అని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి బీఆర్ఎస్ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో తోట చంద్రశేఖర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. తాగు, సాగు నీటి సమస్యలు మాత్రం తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థపై పట్టులేదని.. మనం ఎన్నో సమస్యలతో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతూనే ఉన్నామని అన్నారు. తెలుగు రాష్ట్రాల పునర్విభజన తర్వాత ఏపీలో కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయని.. ఇప్పటి వరకు ఏపీకి ఒక రాజధాని లేకపోవడం చాలా విచారకరమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు తొమ్మిదేళ్లయినా ఇంకా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దక్షిణాదిపై కేంద్రంలోని బీజేపీ సవతి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. విజయవాడ, విశాఖపట్నం నగరాలకు ఇప్పటికీ మెట్రో సౌకర్యం ఏర్పడటకపోవడం బాధకరమన్నారు. వీటన్నింటిపై కేంద్రాన్ని నిలదీసే వాళ్లే లేరని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెంది.. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లోనూ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తక్షణ అవసరం అన్నారు. దేశంలో స్వశక్తితో బీఆర్ఎస్ బలమైన పార్టీగా మారబోతోందని తోట చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.

First Published:  22 Feb 2023 8:30 AM GMT
Next Story