Telugu Global
Andhra Pradesh

ఏపీలో వామపక్ష నాయకులకు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అవుతుందా..?

విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల తాజాగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మేయర్ గా పనిచేసి ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మొట్టమొదటి మహిళా నేత ఆమె.

ఏపీలో వామపక్ష నాయకులకు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అవుతుందా..?
X

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకుంటున్న కేసీఆర్ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో ముందుగా ఏపీకి పార్టీ అధ్యక్షుడిని నియమించారు. తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేరికలు మొదలయ్యాయి. ఏపీలో ఇప్పటికే న్యూస్ ఛానెల్ కూడా లైన్లో ఉంది. కొత్తగా నమస్తే ఆంధ్రప్రదేశ్ అనే న్యూస్ పేపర్ కూడా మొదలుపెట్టబోతున్నారు. ఇక చేరికల విషయానికొస్తే మహిళా నేతలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్నారు.

విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల తాజాగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మేయర్ గా పనిచేసి ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మొట్టమొదటి మహిళా నేత ఆమె. సీపీఐ తరపున గెలిచి విజయవాడ మేయర్ గా పనిచేసిన ఆమె, ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్నా కూడా రాజకీయంగా యాక్టివ్ గా లేని శకుంతల, ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ మహిళా విభాగంలో చురుగ్గా పనిచేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆమెతోపాటు సీపీఐనుంచి మరికొందరు మహిళా నేతలు కూడా బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని సమాచారం.

ప్రస్తుతం ఏపీలో వామపక్షాలు బాగా నీరసంగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి కూడా చూపించడంలేదు. కానీ విధిలేని పరిస్థితుల్లో సీపీఐ, టీడీపీకి కొమ్ము కాస్తున్నా, సీపీఎం మాత్రం అంటీ ముట్టనట్టుగానే ఉంది. కొన్నాళ్లు జనసేనతో చేసిన స్నేహం కూడా లాభం లేదు. దీంతో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలనుకుంటున్న నేతలు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. వారికి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రత్యామ్నాయంలా కనిపిస్తోంది. ఉద్యమ నేపథ్యం ఉన్న బీఆర్ఎస్ లో చేరేందుకు వామపక్ష నేతలు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. తాడి శకుంతల చేరికతో ఏపీలో బీఆర్ఎస్ మహిళా విభాగంపై కూడా పూర్తి స్థాయిలో దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. జనసేన నుంచి కూడా ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. ముందు ముందు ఏపీ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే అవకాశముంది.

First Published:  24 Feb 2023 3:46 AM GMT
Next Story