Telugu Global
Andhra Pradesh

ఆంధ్రపార్టీలు ఎక్కడ..? - విశాఖ ఉక్కు ఉద్యమంలో బీఆర్ఎస్, ఆప్

ప్రస్తుతం ఏపీలో ఉన్న టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు వివిధ కారణాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విశాఖ ఉక్కు విషయంలో పోరాడేందుకు సిద్ధంగా లేవు.

ఆంధ్రపార్టీలు ఎక్కడ..? - విశాఖ ఉక్కు ఉద్యమంలో బీఆర్ఎస్, ఆప్
X

విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం శుక్రవారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరుతామని కేంద్రం స్పష్టం చేసింది. అందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని కేంద్రం తేల్చి చెప్పింది. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ స్టేట్ మెంట్ తో కొంత గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తమకు ప్రథమ ప్రాధాన్యం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఇక ఈ విషయంపై తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అక్కడి ఉద్యోగస్తులు, ఉక్కు పరిరక్షణ సమితి నేతలు అలర్ట్ అయ్యారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు వాళ్లు 800 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే శనివారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. వారి ఆందోళనలకు రాష్ట్రానికి చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన మద్దతు తెలపలేదు. ఆశ్చర్యంగా బీఆర్ఎస్, ఆప్ పార్టీలు మద్దతు తెలపడం గమనార్హం.

నిజానికి ఏపీలో బలపడాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం కలిసొచ్చింది. తెలంగాణ పార్టీగా ఆంధ్రా ప్రజల మనసుల్లో గూడు కట్టుకొని పోయిన.. బీఆర్ఎస్ కు ఈ అంశం కొంత ఊరట అని చెప్పుకొవచ్చు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మొదటి నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. శనివారం నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు.

ప్రస్తుతం ఏపీలో ఉన్న టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు వివిధ కారణాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విశాఖ ఉక్కు విషయంలో పోరాడేందుకు సిద్ధంగా లేవు. సరిగ్గా ఇదే అవకాశాన్ని బీఆర్ఎస్ వినియోగించుకుంటోంది. మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు దొరుకుతుందా..? ప్రజలు ఉద్యమకారులకు అండగా నిలబడతారా..? అన్నది వేచి చూడాలి.

First Published:  15 April 2023 1:38 PM GMT
Next Story