Telugu Global
Andhra Pradesh

బొజ్జల సుధీర్ రెడ్డి ఆడియో ఎఫెక్ట్- చేరికలు ఆపిన చంద్రబాబు

ఇలా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో టీడీపీ నాయకత్వం అప్రమత్తమైంది. పార్టీలో చేరేందుకు నేడు రావొద్దు అని ఎన్సీవీ నాయుడికి సమాచారం ఇచ్చారు.

బొజ్జల సుధీర్ రెడ్డి ఆడియో ఎఫెక్ట్- చేరికలు ఆపిన చంద్రబాబు
X

బొజ్జల సుధీర్ రెడ్డి ఆడియో ఎఫెక్ట్- చేరికలు ఆపిన చంద్రబాబు

సత్తెనపల్లి స‌న్నివేశ‌మే శ్రీకాళహస్తి టీడీపీలోనూ కనిపిస్తోంది. కొత్త నాయకులను తెచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు చేస్తున్న ప్రయోగాలు పాత నాయకుల కారణంగా వికటిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌చార్జ్‌గా బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు.


వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ అనుకున్నారు. కానీ హఠాత్తుగా మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడిని చంద్రబాబు పార్టీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన గతంలో టీడీపీలోనే ఉండేవారు. అక్కడ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి 2004లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై గెలిచారు. 2009లో మాత్రం ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరినా పోటీ చేసే అవకాశం దక్కలేదు.


అక్కడ బియ్యపు మధుసూదన్ రెడ్డి గట్టిగా పాతుకుపోయారు. దాంతో తిరిగి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.. చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేడు ఓ వంద వాహనాల్లో అమరావతి వెళ్లి వెళ్లి టీడీపీలో చేరాల్సి ఉంది.

ఇంతలో బొజ్జల సుధీర్ రెడ్డి ఆడియో టేపు వదిలేశారు. ఎన్సీవీ నాయుడు చేరిక‌పై తనకు ఎలాంటి సమాచారం లేదని.. చేరిక కార్యక్రమానికి వెళ్లవద్దని కార్యకర్తలకు అందులో సూచించారు. దీన్ని హెచ్చరిక అనుకుంటారా, లేక విజ్ఞప్తి అనుకుంటారా మీ ఇష్టం అంటూ స్పష్టం చేశారు. ఎన్సీవీ నాయుడు వైసీపీ నుంచి వస్తున్నారని.. ఆయన వెంట ఎంత మంది వైసీపీ నుంచి వస్తారో చూద్దామంటూ మాట్లాడారు.

ఇలా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో టీడీపీ నాయకత్వం అప్రమత్తమైంది. పార్టీలో చేరేందుకు నేడు రావొద్దు అని ఎన్సీవీ నాయుడికి సమాచారం ఇచ్చారు. ఈనెల 14న కుప్పం రావాల్సిందిగా అటు ఎన్సీవీ నాయుడు, బొజ్జల సుధీర్‌ రెడ్డికి పార్టీ ఆదేశించింది. అక్కడే చంద్రబాబు ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుతారని చెబుతున్నారు. ఎన్సీవీ నాయుడు పార్టీలోకి వస్తే అతడికే టికెట్ ఇస్తారేమోనన్న అనుమానం కూడా సుధీర్ రెడ్డిలో ఉంది.

First Published:  8 Jun 2023 7:51 AM GMT
Next Story