Telugu Global
Andhra Pradesh

బీజేపీ టార్గెట్ జగన్.. వైసీపీ టార్గెట్ మాత్రం మోదీ కాదు..

ఏపీలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ నుంచి గట్టి కౌంటర్లు పడటంలేదు. స్టిక్కర్ పార్టీ అనే మాట చంద్రబాబు నోటినుంచో, పవన్ నోటినుంచో వచ్చి ఉంటే ఈపాటికి ఏ స్థాయిలో రచ్చ జరిగేదో అందరికీ తెలుసు.

బీజేపీ టార్గెట్ జగన్.. వైసీపీ టార్గెట్ మాత్రం మోదీ కాదు..
X

ఏపీలో బీజేపీ నేతలు వైసీపీ అధినేతను చెడామడా తిడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దానికి కౌంటర్ గా వైసీపీనుంచి కూడా మాటల తూటాలు పేలతాయి. కానీ అవి కేవలం ఏపీ బీజేపీకే పరిమితం అవుతున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కారుని కానీ, మోదీని కానీ పల్లెత్తు మాట అనడంలేదు వైసీపీ నేతలు.

తాజాగా ఏపీలోని రైతు భరోసా కేంద్రాలన్నీ రైతు బేజారు కేంద్రాలంటూ విమర్శించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. గతంలో కూడా ఆయన జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ గ్రాఫ్ పడిపోతోందని, అందుకే ఆయన ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారని అన్నారు. ఎన్నికలైన మూడున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యేలకు సీఎం దర్శన భాగ్యం కలిగిందని ఎద్దేవా చేశారు. సత్యకుమార్ విమర్శలను ఖండించిన మంత్రి జోగి రమేష్.. అసత్యకుమార్ అబద్ధాల పుట్ట అంటూ మండిపడ్డారు. ఆయన టీడీపీ ఏజెంట్ అని, చంద్రబాబు కోసమే జగన్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

స్టిక్కర్ పార్టీ అన్నా మౌనమే..!

జగన్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని ఏపీ బీజేపీ సహ ఇన్ చార్జ్ సునీల్ దియోధర్ ఇటీవల కామెంట్ చేశారు. మోదీ పథకాలకు జగన్ స్టిక్కర్లు మార్చుకుంటున్నారని, ఆయనది స్టిక్కర్ పార్టీ అని ఎద్దేవా చేశారు. అమరావతిని చంద్రబాబు, జగన్ ఇద్దరూ నాశనం చేశారని మండిపడ్డారు. ఇవే కాదు, ఏపీలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ నుంచి గట్టి కౌంటర్లు పడటంలేదు. స్టిక్కర్ పార్టీ అనే మాట చంద్రబాబు నోటినుంచో, పవన్ నోటినుంచో వచ్చి ఉంటే ఈపాటికి ఏ స్థాయిలో రచ్చ జరిగేదో అందరికీ తెలుసు. కానీ బీజేపీని మాత్రం ఉద్దేశపూర్వకంగానే సైడ్ చేయాలనుకుంటున్నారు వైసీపీ నేతలు. ఒకవేళ మరీ అంతగా విమర్శలు చేయాలని అనిపించినా, ఆ మేరకు ఒత్తిడి వచ్చినా అసత్యకుమార్ అనే డైలాగు దగ్గరే మంత్రులు ఆగిపోతున్నారు. మోదీని కానీ, కేంద్రాన్ని కానీ టచ్ చేయాలనుకోవడంలేదు, చేసే ఉద్దేశం కుడా వైసీపీ మంత్రులకు లేదని చెప్పాలి.

Next Story