Telugu Global
Andhra Pradesh

ఏపీలో బీజేపీ అట్టర్ ఫ్లాప్‌.. - కారణం సోము వీర్రాజేనే.. ఇంకేమైనా ఉందా?

నిజానికి ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. కానీ, ఏ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అవగాహన కుదుర్చుకున్నట్టు కనిపించదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ఓట్లు అసలు బీజేపీకి ట్రాన్స్ ఫర్ కాలేదన్నది.. బీజేపీ నేతల ఆరోపణ.

ఏపీలో బీజేపీ అట్టర్ ఫ్లాప్‌.. - కారణం సోము వీర్రాజేనే.. ఇంకేమైనా ఉందా?
X

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతిన్నది. ఆ పార్టీ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు కానీ.. ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటుందని ఊహించలేదు. కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానంలో చెల్లని ఓట్ల కంటే బీజేపీకే తక్కువ ఓట్లు పడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఓటమికి సహజంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపైనే నెపం వేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఆ బాధ్యత తీసుకోక తప్పదు.

నిజానికి ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. కానీ, ఏ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అవగాహన కుదుర్చుకున్నట్టు కనిపించదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ఓట్లు అసలు బీజేపీకి ట్రాన్స్ ఫర్ కాలేదన్నది.. బీజేపీ నేతల ఆరోపణ. మరోవైపు బీజేపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం ఉంది. అందుకే గ్రాడ్యుయేట్లు ఎవరూ ఆ పార్టీల‌కు ఓటు వేయలేదని చెప్పారు. భవిష్యత్‌లో బీజేపీ.. వైసీపీని విడిచిపెట్టి టీడీపీ, జనసేనతో జట్టు కట్టాలని సూచించారు.

అయితే గతంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి నేతలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి ఏవిధమైన సపోర్ట్ చేయకుండా టీడీపీకి పరోక్షంగా సపోర్ట్ చేశారని.. సోము వీర్రాజును ఫెయిల్యూర్ అని చూపించడానికి తాపత్రయ పడ్డారనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదుగా మారాయి. మరి అధినాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  19 March 2023 4:00 AM GMT
Next Story