Telugu Global
Andhra Pradesh

టీడీపీతో బీజేపీ పొత్తు.. మోడీ, జగన్‌ భేటీ తర్వాత సీన్‌ రివర్స్‌...?

అమిత్‌ షా, నడ్డాలతో సమావేశమై తర్వాత బీజేపీతో పొత్తు విషయంపై చంద్రబాబు గానీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

టీడీపీతో బీజేపీ పొత్తు.. మోడీ, జగన్‌ భేటీ తర్వాత సీన్‌ రివర్స్‌...?
X

టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదనే ప్రచారం బలంగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశమైన తర్వాత పరిస్థితి తారుమారైనట్లు తెలుస్తోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమైన మర్నాడే వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాంతో టీడీపీతో బీజేపీ పొత్తు విషయంలో సీన్‌ రివర్స్‌ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.

అమిత్‌ షా, నడ్డాలతో సమావేశమై తర్వాత బీజేపీతో పొత్తు విషయంపై చంద్రబాబు గానీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమిత్‌ షా, నడ్డాలను చంద్రబాబు కలిసి వారం రోజులు దాటిపోయింది. కానీ, ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దాంతో అనుమానాలు పెరుగుతూ వస్తున్నాయి. పొత్తుకు బీజేపీ పెద్దలు చంద్రబాబు వద్ద అనూహ్యమైన డిమాండ్లు పెట్టారనే ప్రచారం ఒక‌టి సాగుతోంది. ఆ ప్రచారంపై కూడా చంద్రబాబు మాట్లాడడం లేదు. వాటిని ఖండించ‌డ‌మూ లేదు.

ఎన్డీఏలో చేరడానికి కొంత మంది ముందుకు వస్తున్నారని అమిత్‌ షా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ వారెవరో చెప్పలేదు. టీడీపీతో పొత్తుపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. పొత్తు ఉంటుందని గానీ, ఉండదని గానీ బీజేపీ చెప్పడం లేదు. ఈ స్థితిలో పొత్తు సందేహంగానే కనిపిస్తోంది. చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత పొత్తుపై మాట్లాడడానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హస్తిన వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఆయన ఇక్కడే ఉంటున్నారు.

జగన్‌తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీతో బీజేపీ పొత్తు గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. మోడీతో తాను రాజకీయాలు చర్చించినట్లు జగన్‌ తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడా చెప్పలేదు. కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లుగా వార్త‌ల్లో చ‌దివాం.

First Published:  15 Feb 2024 10:59 AM GMT
Next Story