Telugu Global
Andhra Pradesh

ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ.. జగన్ వ్యూహం ఏంటి..?

ఏపీలో బీజేపీ, వైసీపీ రెండూ ఒకటేననే అపవాదు ఉందని, దాన్ని తొలగించుకోడానికి కృషి చేస్తామంటూ ఆమధ్య ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడా ప్లాన్ అమలులో పెట్టినట్టున్నారు.

ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ.. జగన్ వ్యూహం ఏంటి..?
X

ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్లెన్ని, సీట్లెన్ని..? అసలు ఏపీలో బీజేపీకి అంత సీన్ ఉందా..? ప్రతి ఉప ఎన్నికల్లో మేమున్నామంటూ బీజేపీ పోటీ చేస్తూ డిపాజిట్లు పోగొట్టుకుంటూనే ఉంది. జనసేనతో పొత్తులో ఉండబట్టి, ఆ మాత్రం అయినా బీజేపీ గురించి మాట్లాడుకుంటారు, లేకపోతే ఏపీలో కాంగ్రెస్ లాగానే బీజేపీ కూడా. అయితే ఇటీవల ఏపీలో మళ్లీ బీజేపీ ప్రస్తావన వచ్చింది. మొన్న అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ నేతల కార్లపై రాళ్లు పడ్డాయి, అద్దాలు ధ్వంసమయ్యాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పల్నాడులో హడావిడి చేశారు. ఇసుక రీచ్ లను పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రచ్చ రచ్చ జరిగింది.

అసలు బీజేపీ నిరసనల్ని అడ్డుకోవాల్సినంత అవసరం ఉందా..? పోలీసులు పట్టించుకోకుండా ఉంటే ఫొటోలకు ఫోజులిచ్చి నాయకులు వెళ్లిపోయేవారేమో. కానీ పోలీసులు ముందస్తుగానే వీర్రాజు కారుని అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా వైకుంఠపురంలోని ఇసుక రీచ్ ల వద్దకు వెళ్లనీయలేదు. దీంతో వీర్రాజు మండిపడ్డారు. బీజేపీ నేతల్ని అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలు పెడతామని హెచ్చరించారు.

పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రీచ్ లను పరిశీలించేందుకు రాత్రి అక్కడికి వచ్చిన పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధాకర్ కారుపై కొంతమంది దాడి చేశారు. దీన్ని ఖండిస్తూ ఈరోజు సోము వీర్రాజు అక్కడ హడావిడి చేశారు.

రోడ్ మ్యాప్ అదేనా..?

ఇన్నాళ్లూ జనసేన అధ్యక్షుడు రోడ్ మ్యాప్ అంటుంటే బీజేపీ అధిష్టానం అస్సలు పట్టించుకోలేదు, మరి ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బీజేపీ ఇంకెవరికో రోడ్ మ్యాప్ ఇచ్చినట్టుంది. అందుకే బీజేపీకి లేనిపోని హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ హడావిడి అంతా దేనికోసమో మరికొన్నిరోజులాగితే తేలిపోతుంది. ఏపీలో బీజేపీ, వైసీపీ రెండూ ఒకటేననే అపవాదు ఉందని, దాన్ని తొలగించుకోడానికి కృషి చేస్తామంటూ ఆమధ్య ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడా ప్లాన్ అమలులో పెట్టినట్టున్నారు.

First Published:  3 April 2023 6:57 AM GMT
Next Story