Telugu Global
Andhra Pradesh

పవన్‌పైన బీజేపీ మండిపోతోందా ?

పవన్ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు కనబడకపోయినా.. జనసేన కార్యకర్తలు మాత్రం చంద్రబాబు పర్యటనల్లో జెండాలు పట్టుకుని కనిపిస్తున్నారు. ఇక్కడే బీజేపీకి బాగా మండుతోంది.

పవన్‌పైన బీజేపీ మండిపోతోందా ?
X

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే ఇద్దరు కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. వైజాగ్ ఎయిర్ పోర్టు గొడవ తర్వాతే వీళ్ళిద్దరు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్ననే ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చేస్తోంది ప్రభుత్వం అంటు పవన్ నానా గోలచేశారు. ఆ కార్యక్రమంలో కూడా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు కలవలేదు.

అయితే పది రోజుల క్రితం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చంద్రబాబు పర్యటించినపుడు టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. రెండు పార్టీల జెండాలు కనిపించాయి. అలాగే నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పర్యటన సందర్భంగా కూడా టీడీపీ, జనసేన జెండాలు కనిపించాయి. తమ్ముళ్ళతో కలిసి జనసేన కార్యకర్తలు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారట. ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కలిసి జాయింటుగా ఏ కార్యక్రమంలోను పాల్గొనకపోయినా కార్యకర్తలు మాత్రం కలిసిపోయినట్లున్నారు.

పవన్ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు కనబడకపోయినా జనసేన కార్యకర్తలు మాత్రం చంద్రబాబు పర్యటనల్లో జెండాలు పట్టుకుని కనిపిస్తున్నారు. ఇక్కడే బీజేపీకి బాగా మండుతోంది. మూడున్నరేళ్ళుగా బీజేపీ, జనసేన పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క కార్యక్రమంలో కూడా ఐక్య పోరాటాలు చేసింది లేదు. బీజేపీ ఏ కార్యక్రమం నిర్వహించినా, బహిరంగ సభలు జరిపినా పవన్ కనబడలేదు. బీజేపీ కార్యక్రమాల్లో జనసేన కార్యకర్తలు పాల్గొన్నదిలేదు. ఇదే సమయంలో జనసేన నిర్వహించిన ఏ కార్యక్రమంలో కూడా బీజేపీ నేతలు కనబడింది లేదు.

పేరుకు మాత్రమే మిత్ర పక్షాలుగా చెప్పుకుంటున్న రెండు పార్టీల నేతలు ఒక‌రితో మ‌రొక‌రు ఎక్కడా కలవటం లేదు. మీడియా సమావేశాల్లో మాత్రమే తమ పార్టీలు మిత్ర పక్షాలే అంటు చెప్పుకొస్తున్నారు. నిజానికి కలిసి పనిచేయాలని రెండు పార్టీల్లోని నేతలకు మనసులో ఏమూలా లేదు. కానీ ఏదో తప్పదు అన్నట్లుగా బలవంతపు కాపురంలాగ నెట్టుకొస్తున్నారు. అలాంటిది ఇపుడు చంద్రబాబు పర్యటనల్లో జనసేన కార్యకర్తలు, జెండాలను చూసి బీజేపీ నేతలు మండిపోతున్నారట. చూస్తుంటే అధికారికంగా రెండు పార్టీలు విడిపోయే రోజు ఎంతో దూరంలో లేదనే అనుమానాలు పెరిగిపోతోంది.

First Published:  8 Nov 2022 5:37 AM GMT
Next Story