Telugu Global
Andhra Pradesh

లేఖలే లేఖలు.. జగన్ ఇన్ బాక్స్ ఫుల్

ఏపీలో ఇప్పటివరకు ఐటీ రంగానికి సంబంధించి పాలసీలు రూపొందించారే కానీ, పని జరగడం లేదని మండిపడ్డారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. ఐటీ కోసం శాటిలైట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేఖలే లేఖలు.. జగన్ ఇన్ బాక్స్ ఫుల్
X

ఈ మధ్య ఏపీ సీఎం జగన్ కి బహిరంగ లేఖలు ఎక్కువయ్యాయి. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య ఆమధ్య లేఖాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం కూడా వరుసగా రెండుసార్లు బహిరంగ లేఖలు రాశారు, అప్పట్లో చంద్రబాబు, ఇటీవల పవన్ కల్యాణ్, నారా లోకేష్ పోటీపడి మరీ జగన్ కి లేఖలు రాశారు. ఏపీలో పింఛన్ల కోతపై లోకేష్, పవన్ నిలదీశారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లైన్లోకి వచ్చారు. జగన్ కి ఓపెన్ లెటర్లు రాస్తూ విమర్శలు చేయడం జీవీఎల్ కి అలవాటే. గతంలో ఇంగ్లిష్ మీడియం బోధనపై కూడా ఇలాగే ముఖ్యమంత్రి పేరిట బహిరంగ లేఖ రాశారు జీవీఎల్. ఇప్పుడాయన ఏపీలో ఐటీరంగం అభివృద్ధిపై పలు సూచనలు చేశారు.

ఏపీలో ఇప్పటివరకు ఐటీ రంగానికి సంబంధించి పాలసీలు రూపొందించారే కానీ, పని జరగడం లేదని మండిపడ్డారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. ఐటీ కోసం శాటిలైట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ స్టార్టప్స్ కోసం సహకారం అందించాలన్నారు. ఐటీ కంపెనీలకు ఇన్సెంటివ్స్ రూపంలో బకాయి పడ్డ 90 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలన్నారు. ఐటీ అభివృద్ధిని ఈ ఏడాది ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కోరారు.

లేఖాస్త్రాలతో సాధించేదేంటి..?

ముఖ్యమంత్రికి లేఖాస్త్రం అంటే.. ఆయన్ని తిడుతూ ఆయన అడ్రస్ కే లేఖ రాయడం. ఓ కాపీ మీడియాకి విడుదల చేయడం. ఇలా ముఖ్యమంత్రికి సుద్దులు చెబుతూ రాసే లేఖలతో ప్రయోజనం ఏంటి..? కేవలం మీడియాలో బీజేపీకి ప్రచారం కల్పించుకోవడమే ఈ లేఖాస్త్రాల ఉద్దేశం. ఆ మాటకొస్తే ఏపీలో ఐటీ అభివృద్ధికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసిన సాయమెంత. తెలంగాణలో అంకురాలు, ఇంక్యుబేటర్లు, ఐటీ హబ్ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్లే ఐటీరంగం అభివృద్ధి చెందుతోంది కానీ కేంద్రంనుంచి బీజేపీ ఇచ్చిన సహకారం శూన్యం. ఇప్పుడు కూడా కేంద్రం ఏం చేస్తుందనేది చెప్పుకోలేక, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు జీవీఎల్.

First Published:  1 Jan 2023 12:57 PM GMT
Next Story