Telugu Global
Andhra Pradesh

కాపునాడుకు జీవీఎల్ మాత్రమే.. కీలక వ్యాఖ్యలు

ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కాపు వర్గానికి చెందిన నాయకులను గిరి గీసి అందులో నిలబెట్టారని జీవీఎల్ విమర్శించారు. కాపు నాయకులకు అధికారం లేని అలంకారప్రాయమైన పదవులు మాత్రమే ఇస్తున్నారన్నారు.

కాపునాడుకు జీవీఎల్ మాత్రమే.. కీలక వ్యాఖ్యలు
X

విశాఖలో జరిగిన కాపునాడు సభకు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కాలేదు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రమే చెప్పుకోదగ్గ నాయకుడిగా హాజరయ్యారు. టీడీపీ, వైసీపీతో పాటు ఇతర పార్టీల కాపు నేతలు కూడా ఈ స‌భ‌కు దూరంగా ఉన్నారు. సభా వేదిక మీద పెద్దపెద్ద పవన్ కల్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేశారు. దాంతో ఇతర పార్టీలు ఊహించినట్టుగానే ఈ సభ జనసేన కోసం జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది.


సభలో ప్రసంగించిన ఎంపీ జీవీఎల్.. వంగవీటి రంగా పేరుతో జిల్లా ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. వైఎస్‌ పేరుతో ఒక జిల్లా, ఎన్టీఆర్‌ పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేసినప్పుడు రంగా పేరుతో ఎందుకు జిల్లా ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు. అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారని.. కానీ, చరిత్రలో నిలిచిపోయే వారు మాత్రమే కొందరే ఉంటారని, అలాంటి వారిలో వంగవీటి రంగా ఒకరన్నారు. కేవలం 41ఏళ్లకే రంగాను దారుణంగా హత్య చేశారని.. ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడిని చూసి ఆయన ఇంకా ఏ స్థాయికి ఎదుగుతారో అని భయపడి చంపేశారన్నారు.

రంగాను కాపు నాయకుడిగా మాత్రమే ప్రజలు చూడలేదని.. అందరి వాడిలా చూశారని అదే ప్రత్యర్థులకు భయం పుట్టించిందన్నారు. కర్నాటక, గుజరాత్‌తో పాటు దేశంలో ని అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని.. అక్కడంతా బలమైన సామాజికవర్గం వారే అధికారంలో ఉన్నారని.. ఒక్క ఏపీలో మాత్రమే పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.

కాపు సభ పట్ల ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించారు. ఒక్కసారి ఈ సామాజికవర్గం అధికారం చేపడితే ఇక తమకు అవకాశం ఉండదన్న అభిప్రాయం పార్టీల్లో ఉండవచ్చన్నారు. ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కాపు వర్గానికి చెందిన నాయకులను గిరి గీసి అందులో నిలబెట్టారని జీవీఎల్ విమర్శించారు. కాపు నాయకులకు అధికారం లేని అలంకారప్రాయమైన పదవులు మాత్రమే ఇస్తున్నారన్నారు. పెద్దపెద్ద మంత్రులకు కూడా నోరు విప్పే స్వేచ్ఛ‌ లేదన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న తూర్పు కాపులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా చొరవ చూపింది తానేనని జీవీఎల్ చెప్పారు.

First Published:  26 Dec 2022 2:02 PM GMT
Next Story