Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరే సమాధి కట్టేస్తారా?

పురందేశ్వరి వైఖరి వల్ల ఏమైందంటే టీడీపీ అధ్యక్షుడు, మరిది చంద్రబాబుతో చేతులు కలిపిందనే విషయం పార్టీ నేతలతో పాటు జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఇదే సమయంలో మిత్రపక్షం జనసేన బహిరంగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించేసింది.

పురందేశ్వరే సమాధి కట్టేస్తారా?
X

బీజేపీకి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరే సమాధి కట్టేసేట్లుగా ఉన్నారు. అసలు ఏపీలో బీజేపీకి ఉన్నదేమీ లేదు కొత్తగా పోవటానికి. అయితే మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు హయాంలో పార్టీలో కాస్త యాక్టివిటీస్ నడిచాయి. టీడీపీ, వైసీపీని ప్రత్యర్థులుగా వీర్రాజు భావించారు. బాగా బలహీనంగా ఉంది కాబట్టి ముందు టీడీపీని దెబ్బకొడతామని వీర్రాజు చాలాసార్లు చెప్పారు. టీడీపీని దెబ్బకొడితే కానీ బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అవదని వీర్రాజు చెప్పేవారు. ఒక విధంగా రాజకీయంగా బీజేపీది సరైన నిర్ణయమే.

ప్రత్యర్థుల్లో బలవంతులను ఎలాగూ దెబ్బకొట్టలేరు కాబట్టి బలహీనంగా ఉన్న ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని అనుకోవటం కరెక్టు రాజకీయమే. టీడీపీని దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారు కాబట్టే వీర్రాజుపై ఎల్లో మీడియా విపరీతంగా టార్గెట్ చేసింది. అలాగే పార్టీలోని వీర్రాజు వ్యతిరేకులు, చంద్రబాబునాయుడు మద్దతుదారులు ఢిల్లీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి అధ్యక్షుడిని మార్పించేశారు. దాంతో కొత్త అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు తీసుకున్నారు. ఈమె రావటం రావటమే వీర్రాజు స్ట్రాటజీకి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించటం మొదలుపెట్టారు.

బలహీనంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేయటానికి బదులు అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత రచ్చ చేసినా చేయగలిగేదేమీ లేదని అర్థ‌మైపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి కాబట్టి. పురందేశ్వరి వైఖరి వల్ల ఏమైందంటే టీడీపీ అధ్యక్షుడు, మరిది చంద్రబాబుతో చేతులు కలిపిందనే విషయం పార్టీ నేతలతో పాటు జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఇదే సమయంలో మిత్రపక్షం జనసేన బహిరంగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించేసింది.

నిజానికి తమ మిత్రపక్షం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పురందేశ్వరి ఆక్షేపించాలి. కానీ ఆమె అలా చేయకపోగా జనసేన ఇప్పటికి తమ మిత్రపక్షమే అని చిలకపలుకులు పలుకుతున్నారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం పాకులాడుతు, మిత్రపక్షం జనసేనను కంట్రోల్ చేయకపోవటం అన్నది పార్టీ కోణంలో పురందేశ్వరి ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అయితే వ్యక్తిగతంగా పురందేశ్వరి కోణంలో చూస్తే మాత్రం ఉద్దేశ‌పూర్వకంగా చేస్తున్నదనే అనిపిస్తోంది. అందుకనే పార్టీకి అడుగు బొడుగు ఓట్లేమైనా ఉంటే అవి కూడా పురందేశ్వరి పుణ్యమాని దూరమైపోవటంట ఖాయం.

First Published:  27 Nov 2023 5:23 AM GMT
Next Story