Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఏదో ఒకటి చేయాలి.. గల్లీ మీటింగ్ లతో బీజేపీ గేమ్ ప్లాన్..

గల్లీ స్థాయి సభలకు కాస్త హుందాగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అనే పేరు పెట్టారు బీజేపీ నేతలు. ఈనెల 18నుంచి అక్టోబర్ 2 వరకు ఏపీలోని అన్ని జిల్లాల్లో ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరుపుతారు.

ఏపీలో ఏదో ఒకటి చేయాలి.. గల్లీ మీటింగ్ లతో బీజేపీ గేమ్ ప్లాన్..
X

తెలంగాణలో బీజేపీ పేరు కాస్తో కూస్తో వినపడుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలున్నా కూడా వచ్చే దఫా విజయం మాదేనంటూ రెచ్చిపోతున్నారు బీజేపీ నేతలు. హడావిడి చేయడం, రెండు రోజులకోసారి కేంద్ర మంత్రుల్ని తీసుకురావడం, వారు ఖాళీగా లేకపోతే జేపీ నడ్డాని ఫ్లైటెక్కించడం.. ఇలా ఏదో ఒకటి జరుగుతోంది. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు లేరు. పేరున్న నాయకులకు పదవులు లేవు. దీంతో ఇక్కడ కూడా ఏదైనా చేయాలని బీజేపీ తాపత్రయ పడుతోంది. కొత్తగా గల్లీ మీటింగ్ లు అనే కాన్సెప్ట్ తెరపైకి తెచ్చింది.

స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్..

గల్లీ స్థాయి సభలకు కాస్త హుందాగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అనే పేరు పెట్టారు బీజేపీ నేతలు. ఈనెల 18నుంచి అక్టోబర్ 2 వరకు ఏపీలోని అన్ని జిల్లాల్లో ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరుపుతారు. దాదాపు 5వేల సభలు జరపాలనేది వీరి టార్గెట్. ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో స్థానిక నేతలు ఈ మీటింగ్స్ పెడతారు. కాస్త జిల్లా స్థాయిలో పేరున్న నేతలు వీటికి హాజరవుతారు. రాష్ట్ర నేతలు, ఎమ్మెల్సీలు కూడా ఈ మీటింగ్ లకు వచ్చి స్థానిక నాయకులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తారు.

టార్గెట్ వైసీపీ..

సహజంగా మోదీ గొప్పలు చెప్పుకోడానికి బీజేపీ నేతలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మోదీ చించేశారు, పొడిచేశారు అంటే.. ముందుగా విభజన హామీలేం చేశారని ప్రజలు అడిగే అవకాశముంది. అందుకే అక్కడా ఇక్కడా బీజేపీ నేతలు తమ గొప్పలు చెప్పుకోవడం కాస్త తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలపై ఫోకస్ పెట్టాయి. ఏపీలో వైసీపీ వైఫల్యాలను స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో ఎండగడతామంటూ ముందుకొస్తున్నారు బీజేపీ నేతలు.

ఖర్చులేని పని..

ఒకరకంగా ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అంటే చాయ్ పే చే చర్చాలాంటివే. గల్లీ మీటింగ్ లకు జనాలను తీసుకు రావాల్సిన పని లేదు, అతిథులు, శాలువాలు, సత్కారాలు ఇవేవీ ఉండవు. కేవలం మైక్ తీసుకుని కాసేపు వైసీపీని తిట్టి తమని తాము పొగుడుకుని అక్కడినుంచి వెళ్లిపోతారు. అందుకే సింపుల్ గా ఈ పని మొదలు పెడుతున్నారు ఏపీ బీజేపీ నేతలు. కొన్నిచోట్ల మాత్రం కేంద్ర మంత్రుల్ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరి నాయకులు ఏమేరకు వస్తారు, వచ్చినా వారి మాటల్ని ఏపీ ప్రజలు ఏమేరకు వింటారనేది ఈ మీటింగ్ లతో తేలిపోతుంది. స్ట్రీట్ కార్నర్ లో ప్రత్యేక హోదా అంటూ ప్రజలు బీజేపీని కార్నర్ చేస్తే మాత్రం కమలదళం పని గల్లంతే.

Next Story