Telugu Global
Andhra Pradesh

ఏపీలో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశముంది

ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ దాఖలు చేసిన రూ.100∙కోట్ల పరువు నష్టం దావా కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఏపీలో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశముంది
X

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశముందని బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మంచి విశ్వసనీయత కలిగిన నాయకుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రికపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దాఖలు చేసిన కేసులో వాదనలు వినిపించేందుకు గురువారం తిరుపతి వచ్చిన సుబ్రమణ్యస్వామి.. కోర్టు సముదాయం ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలపై తన అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రతినిధులు కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల గురించి కూడా స్పందించాలని మీడియా కోరగా.. చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌తోనూ పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు.

ఆంధ్రజ్యోతిపై విచారణ 27కి వాయిదా..

ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ దాఖలు చేసిన రూ.100∙కోట్ల పరువు నష్టం దావా కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో గురువారం జరిగిన ఈ కేసు విచారణలో భాగంగా గతంలో దాఖలైన రెండు పిటిషన్లపై సుబ్రమణ్యస్వామి వాదనలు వినిపించారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019 డిసెంబరు ఒకటో తేదీన ప్రచురించిన కథనంపై టీటీడీ దాఖలు చేసిన కేసును తాను వాదించడానికి అర్హత లేదంటూ ఆంధ్రజ్యోతి కోర్టుల్లో వాయిదాలపై వాయిదాలు తీసుకుంటూ వచ్చిందని సుబ్రమణ్యస్వామి మీడియాతో చెప్పారు.

కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులోనూ తాను వాదించడానికి వీల్లేదని పిటిషన్‌ వేయగా, న్యాయస్థానం కొట్టివేసిందని ఆయన గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా తాను పలు కేసులను వాదించానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. తనకు వాదనలు వినిపించడానికి అర్హత లేదంటూ ఆంధ్రజ్యోతి యాజమాన్యం వాదించడం హాస్యాస్పదమని తెలిపారు.

First Published:  15 March 2024 4:12 AM GMT
Next Story