Telugu Global
Andhra Pradesh

బీజేపీలో పురందేశ్వరికి అవమానం..

పురందేశ్వరికి బీజేపీ అధిష్టానం షాకిచ్చింది. కీలక బాధ్యతలనుంచి ఆమెను తప్పించింది. పక్క పార్టీలవైపు చూస్తున్నారనే అనుమానంతో ఈ అవమానం జరిగిందని సమాచారం.

బీజేపీలో పురందేశ్వరికి అవమానం..
X

ఏపీలో నందమూరి అభిమానులకు దగ్గరవ్వాలనే ఆలోచనతోనే ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారని అనుకున్నా.. ఇప్పుడు అదే నందమూరి ఆడబిడ్డకు బీజేపీ షాకివ్వడం మాత్రం సంచలనంగా మారింది. ఏపీ బీజేపీలో కీలక నేతగా ఉన్న పురందేశ్వరికి అధిష్టానం షాకిచ్చింది. ఆమెను ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌డ్‌ ఇన్ చార్జ్ గా గతంలో నియమించిన కేంద్ర నాయకత్వం, ఇప్పుడు ఆ పదవుల నుంచి తొలగించింది. ఇటీవలే ఒడిశా ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగించి సహ ఇన్ చార్జ్ గా పరిమితం చేశారు. తాజాగా ఛ‌త్తీస్‌గ‌డ్‌ ఇన్ చార్జ్ పదవినుంచి పూర్తిగా తొలగించారు.

కారణం ఏంటి..?

పురందేశ్వరితో పార్టీకి ఆశించిన ప్రయోజనం లేదనేది వారి అభియోగం. పురందేశ్వరి అధ్యక్షతన గతంలో ఏపీలో విస్తృత చేరికల కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఏపీ బీజేపీలోకి వలసలు లేవు. సామాన్య కార్యకర్తలు కూడా బీజేపీవైపు చూడటంలేదు, ఇక పెద్ద స్థాయి నాయకులు టీడీపీ లేదా వైసీపీ ఈ రెండు పార్టీల మధ్యే దోబూచులాడుతున్నారు. రెండిటిలో స్థానం లేకపోతే జనసేన వైపు చూస్తున్నారు కానీ బీజేపీలో చేరి చేతి చమురు వదిలించుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరు. దీంతో సహజంగానే వలసలు లేకుండా పోయాయి. కానీ బీజేపీ మాత్రం పురందేశ్వరి ప్రభావంతో ఏపీలో భారీగా చేరికలుంటాయని భావించింది. కనీసం నందమూరి అభిమానులైనా పురందేశ్వరి ద్వారా బీజేపీలో చేరతారని అనుకున్నారు. అది కూడా జరగలేదు. దీంతో ప్రస్తుతం బీజేపీ పురందేశ్వరికి పరోక్షంగా పొగపెడుతోంది.

పురందేశ్వరి పార్టీ మారతారా..?

ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు. ఒకవేళ వైసీపీకి వ్యతిరేక ఓటు ఉన్నా అది బీజేపీని చేరే ప్రసక్తే లేదు. జనసేన కూడా బీజేపీకి దూరం జరుగుతోంది. దీంతో పురందేశ్వరి పార్టీమారే అవకాశం ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతల్లో పురందేశ్వరి కీలకంగా ఉంటారని ఆశించినా ప్రయోజనం లేదు. కేవలం ఒకే ఒక్కరోజు ఆమె నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయారు. ఈ కారణాలన్నీ కలిపి ఆమె ప్రాధాన్యం తగ్గిస్తున్నాయని సమాచారం. పార్టీకి పురందేశ్వరి ఉపయోగపడలేదు. పురందేశ్వరికి పార్టీవల్ల ప్రయోజనం లేదు. దీంతో ఈ బంధం ఎక్కువరోజులు కొనసాగేలా కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

First Published:  10 Sep 2022 5:24 AM GMT
Next Story