Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరికి బీజేపీ షాక్

చాలాకాలంగా బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ మిత్రపక్షమైన జనసేనతో ముందు చేతులు కలిపారు.

పురందేశ్వరికి బీజేపీ షాక్
X

పార్టీ అగ్రనేతలు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి షాక్ ఇచ్చారా..? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. విషయం ఏమిటంటే.. రాబోయే ఎన్నికల్లో ఒంటరిపోరుకే అగ్రనేతలు ఫిక్సయ్యారని సమాచారం. అందుకనే 175 అసెంబ్లీలకు 25 పార్లమెంటు సీట్లలో పోటీచేయటానికి ఆసక్తి ఉన్న నేతల పేర్లను రెడీచేయమని పురందేశ్వరికి జాతీయ నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయట. నిజానికి ఈ ఆదేశాలు ఇదివరకు వచ్చినా పార్టీలోని ముఖ్యలు దాన్ని అమల్లోకి రానీయకుండా తొక్కిపెట్టారట.

అయితే తామిచ్చిన ఆదేశాల అమలుపై వాకాబు చేసేటప్పటికీ వేరేదారిలేక హడావుడిగా యాక్షన్లోకి దిగినట్లు తెలిసింది. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయటం కోసం ప్రతిజిల్లాకు ముగ్గురు సీనియర్ సభ్యులతో కమిటీలు వేశారు. ఈ కమిటీలే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ఆశావహుల పేర్లతో జాబితాలను రెడీ చేస్తాయట. జాబితాలు సిద్ధమవ్వగానే దానిపై రాష్ట్రకమిటీలో చర్చించి స్క్రీనింగ్ చేసిన తర్వాత జాతీయ నాయకత్వానికి పంపుతుందని పార్టీవర్గాల సమాచారం.

పార్టీలో మొదలైన ప్ర‌క్రియను చూస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరుకే సిద్ధపడినట్లు అర్థ‌మవుతోంది. చాలాకాలంగా బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ మిత్రపక్షమైన జనసేనతో ముందు చేతులు కలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా పొత్తు సక్సెస్ చేయించుకోవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. బీజేపీ లేకుండా జనసేనతో మాత్రమే పొత్తుపెట్టుకోవటం చంద్రబాబుకు ఇష్టంలేదు. అయితే బీజేపీ అగ్రనేతలు సానుకూలంగా స్పందించటంలేదు. దాంతో ఏమిచేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటంలేదు.

ఈమధ్య టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలవబోతోందనే ప్రచారం మొదలైంది. అయితే సడెన్ గా అన్నీ నియోజకవర్గాల నుండి పోటీకి ఆసక్తి చూపిస్తున్న ఆశావహుల జాబితాలను రెడీచేయాలని ఆదేశాలివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. టీడీపీతో పొత్తుకోసం దగ్గుబాటి పురందేశ్వరి చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే.. తాను గెలవాలంటే టీడీపీ, జనసేనతో పొత్తుంటేనే సాధ్యమవుతుందని ఆమె అనుకుంటున్నారు. అందుకనే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు కొదవలేదు. అయితే పురందేశ్వరి ఆలోచనలకు విరుద్ధంగా అగ్రనేతలు ఆదేశాలివ్వటంతో షాక్ కొట్టినట్లయ్యింది. మరిప్పుడు పురందేశ్వరి పోటీచేస్తారా..?

First Published:  12 Jan 2024 4:12 AM GMT
Next Story