Telugu Global
Andhra Pradesh

పవన్‌కి హెల్ప్ చేస్తా, జనసేన తర‌ఫున‌ పోటీ చేస్తా - బిగ్ బాస్ బ్యూటీ

పవన్ కల్యాణ్ పక్కన ఛాన్స్ వస్తే కాదంటానా అంటోంది వాసంతి. అంతే కాదు, పవన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వద్దంటానా అని ప్రశ్నిస్తోంది.

పవన్‌కి హెల్ప్ చేస్తా, జనసేన తర‌ఫున‌ పోటీ చేస్తా - బిగ్ బాస్ బ్యూటీ
X

పవన్ కల్యాణ్‌ని తిట్టినా, పొగిడినా ఈ రోజుల్లో పెద్ద వార్తే. పవన్‌ని మోసేస్తే జనసైనికులు నెత్తిన పెట్టుకుంటారు, తేడాగా మాట్లాడితే వైసీపీ సానుభూతిపరుల నుంచి సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లకు కొదవే ఉండదు. సరిగ్గా ఇప్పుడు అదే పని చేసింది బిగ్ బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్. ఇటీవలే బిగ్ బాస్ -6 హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాసంతి ఇంటర్వ్యూలతో బిజీబిజీగా కాలం గడుపుతోంది. తాజా ఇంటర్వ్యూలో తాను జనసేన తరపున పోటీ చేస్తానని చెప్పుకొచ్చింది.

పబ్లిసిటీ స్టంటేనా..?

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నారంటేనే వారు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తులు అనుకోవాలి. ఆయా రంగాల్లో రాణించినా లేకపోయినా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను బాగా పెంచుకోలిగితే వారికి వెంటనే ఎంట్రీ దొరుకుతుంది. ఒకటి రెండు చిన్న సినిమాలు, సీరియల్స్ లో యాక్ట్ చేసిన వాసంతి కృష్ణన్ వాటితో రాని గుర్తింపును బిగ్ బాస్‌తో సొంతం చేసుకుంది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడామె సినిమాల్లో తడాఖా చూపించాలనుకుంటోంది. పవన్ కల్యాణ్ పక్కన ఛాన్స్ వస్తే కాదంటానా అంటోంది వాసంతి. అంతే కాదు, పవన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వద్దంటానా అని ప్రశ్నిస్తోంది.

ఆ మధ్య జనసేనను ప్రతి నియోజకవర్గంలో బలోపేతం చేస్తానన్నారు పవన్ కల్యాణ్. చాలామంది ఎమ్మెల్యే టికెట్ ఆశతో ఆయా నియోజకవర్గాల్లో బాగానే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఇటీవల చంద్రబాబుతో దోస్తీకి సై అనే సరికి అందరూ నిరాశపడ్డారు. పొత్తుల్లో జనసేనకు ఎన్ని సీట్లొస్తాయి, వాటికి ఎంతమంది పోటీ ఉంటారనేది ఇంకా తేల లేదు. ఈ లోగా వాసంతి లాంటి అప్ కమింగ్ ఆర్టిస్ట్‌లు పవన్‌కు జై కొడుతున్నారు. ఎక్కడో ఓ చోట టికెట్ ఇవ్వాలంటూ ఇలా బహిరంగ విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఇక్కడ తన ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని చెబుతోంది వాసంతి. తన తండ్రి ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా ఉన్నారని, ఇప్పుడాయన జనసేనకు మద్దతుదారుడిగా ఉన్నారని చెబుతోంది. రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని, జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటోంది. అయితే పవన్, బిగ్ బాస్ బ్యూటీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

First Published:  18 Nov 2022 7:48 AM GMT
Next Story