Telugu Global
Andhra Pradesh

జగన్ కి షాకిచ్చిన నెల్లూరు పెద్దారెడ్లు..

ఎమ్మెల్సీ ఎన్నికలతో నెల్లూరు జిల్లా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. టీడీపీకి పడిన 4 క్రాస్ ఓట్లలో మూడు ఓట్లు నెల్లూరు జిల్లానుంచే ఉండటం గమనార్హం.

జగన్ కి షాకిచ్చిన నెల్లూరు పెద్దారెడ్లు..
X

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీకి 4 ఓట్లు క్రాస్ అయ్యాయి. వైసీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు, టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేశారు. ఆ నలుగురిలో ఇద్దరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. మిగిలిన ఇద్దరిలో ఒకరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని దాదాపుగా వైసీపీ నిర్థారణకు వచ్చింది. ఆయనకు 2024లో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేనని జగన్ ఇదివరకే స్పష్టం చేశారని, అందుకే ఆయన క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని అంటున్నారు. ఆయన ఓటు కేటాయించిన అభ్యర్థి జయమంగళ వెంకట రమణకు 21 ఓట్లే రావడంతో ఈ అనుమానం మరింత బలపడింది. తాజాగా ఆయన ఫోన్ కాల్ కి కూడా అందుబాటులో లేకుండా బెంగళూరు వెళ్లిపోయారన్న సమాచారంతో ఈ విషయం దాదాపుగా రూఢీ అయిపోయింది.

ఏడుగురిలో ముగ్గురు రెబల్..

2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10కి 10 అసెంబ్లీ స్థానాలు 2 లోక్ సభ స్థానాలు వైసీపీకి వచ్చాయి. అంటే నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2 రిజర్వేషన్ సీట్లు, అనిల్ కుమార్ యాదవ్ సీటు పోగా.. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఆ ఏడుగురిలో ముగ్గురు ఇప్పుడు జగన్ కి షాకివ్వడం ఆశ్చర్యకరం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆల్రడీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా వారితో జతకలిశారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇటీవల తన నియోజకవర్గ పరిశీలకుల విషయంలో అలకబూనారు, ఆయనకోసం పరిశీలకుడిని కూడా మార్చింది అధిష్టానం. అయితే వచ్చే దఫా ఎమ్మెల్యే టికెట్ విషయంలో హామీ లేకపోవడంతో ఆయన ప్లేటు ఫిరాయించారు.

టాక్ ఆఫ్ ది స్టేట్ నెల్లూరు..

ఎమ్మెల్సీ ఎన్నికలతో నెల్లూరు జిల్లా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. టీడీపీకి పడిన 4 క్రాస్ ఓట్లలో మూడు ఓట్లు నెల్లూరు జిల్లానుంచే ఉండటం గమనార్హం. మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీకి గుంపగుత్తగా ఇచ్చిన జిల్లాలో ఇలాంటి పరిణామాలు జరుగుతాయని జగన్ కూడా ఊహించి ఉండరు. ఇటీవల తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కూడా నెల్లూరు జిల్లానే కీలకంగా మారిందనే అనుమానం కూడా ఉంది.

నెల్లూరు జిల్లాకి తొలి దఫా రెండు మంత్రి పదవులు దక్కాయి, రెండోసారి కేవలం ఒకటే దక్కింది. ఆ తర్వాతే పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. మంత్రి పదవి ఆశించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎదురు తిరిగారు. సీనియర్ ని అయిన తనను పక్కనపెట్టారనే బాధతో ఆనం రామనారాయణ రెడ్డి కూడా దూరం జరిగారు. తన పదవి తీసేశారనే బాధ అనిల్ కుమార్ యాదవ్ లో ఉన్నా కూడా ఆయన సర్దుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏడుగురు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలలో ముగ్గురు జగన్ ని కాదని దూరం జరగడం మాత్రం విశేషం.

First Published:  24 March 2023 6:33 AM GMT
Next Story