Telugu Global
Andhra Pradesh

బాబుకు గట్టి దెబ్బే తగిలింది.. వైసీపీలోకి జంప్ అయిన సీనియర్ నేత

రాజకీయంగా తమకు బద్ద శత్రువు అయినా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా శ్రీనాథ్ రెడ్డిని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి.. పార్టీలో జాయిన్ చేశారు.

బాబుకు గట్టి దెబ్బే తగిలింది.. వైసీపీలోకి జంప్ అయిన సీనియర్ నేత
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సొంత జిల్లాలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. టార్గెట్-175 లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. అప్పుడే ఎన్నికల రాజకీయాలు మొదలు పెట్టింది. కుప్పంలో ఈ సారి చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు. జిల్లాలో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయంగా బద్ద శత్రువైన శ్రీనాథ్ రెడ్డి ఇప్పుడు పార్టీలోకి రావడం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది.

రాజకీయంగా తమకు బద్ద శత్రువు అయినా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ఆయనను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి.. పార్టీలో జాయిన్ చేశారు. ఇది ఒక రకంగా చిత్తూరు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బే. పీలేరుకు చెందిన జీవీ శ్రీనాథ్ రెడ్డి కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉన్నది. ఒక్క పీలేరులోనే కాకుండా జిల్లా అంతటా వీళ్ల కుటుంబ ప్రభావం ఉంటుంది. ఇక పీలేరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జీవీ శ్రీనాథరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. అక్కడ సామాన్య జనం కూడా పెద్దిరెడ్డి, శ్రీనాథరెడ్డి వర్గాలుగా ఉంటాయంటే.. వీరి మధ్య శతృత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అటువంటి జీవీ శ్రీనాథరెడ్డి ఇప్పుడు పెద్దిరెడ్డి ఉన్న వైసీపీలోకే వచ్చేశారు. ఇది టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. చంద్రబాబుకు ఎంతో విధేయుడిగా, నమ్మకస్తుడిగా ఉంటున్న శ్రీనాథరెడ్డిని ఇటీవల దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. శ్రీనాథరెడ్డి స్థానంలో టీడీపీ తరపున మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారట. మొదటి నుంచి పార్టీలో ఉంటున్న తనను సైడ్ చేసి వేరే వాళ్లను ప్రోత్సహిస్తుండటంతో.. మనస్తాపం చెంది వైసీపీలోకి చేరినట్లు సన్నిహితులు చెప్తున్నారు.

ఇక శ్రీనాథరెడ్డి వంటి నేతను పార్టీలోకి తీసుకొని రావాలని వైసీపీ నేతలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనే ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అప్పట్లో శ్రీనాథరెడ్డి పెద్దగా స్పందించలేదు. కాగా, స్వయంగా తన శత్రువైన పెద్దిరెడ్డే స్నేహ హస్తం చాచడంతో మరో ఆలోచన లేకుండా పార్టీలో చేరిపోయారు. వైఎస్ జగన్ కూడా శ్రీనాథ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని పెద్దిరెడ్డి కూడా ఆయనకు భరోసా ఇచ్చారు. శ్రీనాథరెడ్డి వైసీపీలో చేరడంతో చిత్తూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ శ్రేణులు కూడా అదనపు బలం చేకూరిందని సంబర పడుతున్నాయి.



First Published:  9 Dec 2022 3:55 AM GMT
Next Story