Telugu Global
Andhra Pradesh

జగన్‌ పిలిచాడు.. వైసీపీలోకి వెళ్తున్నా - పులివెందుల సతీష్ రెడ్డి

నాలుగేళ్లుగా రాజకీయాలకు, ప్రజలకు దూరంగా ఉన్నానన్నారు సతీష్ రెడ్డి. పులివెందులలో టీడీపీకి ఏజెంట్లు లేని స్థాయి నుంచి ప్రతి గ్రామంలో ఏజెంట్లు ఉండే స్థాయికి పార్టీని తీసుకువచ్చానన్నారు.

జగన్‌ పిలిచాడు.. వైసీపీలోకి వెళ్తున్నా - పులివెందుల సతీష్ రెడ్డి
X

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత S.V. సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పి వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, సన్నిహితులతో సమావేశం నిర్వహించిన సతీష్ రెడ్డి.. వైసీపీలో చేరతానని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు సతీష్ రెడ్డి.

నాలుగేళ్లుగా రాజకీయాలకు, ప్రజలకు దూరంగా ఉన్నానన్నారు సతీష్ రెడ్డి. పులివెందులలో టీడీపీకి ఏజెంట్లు లేని స్థాయి నుంచి ప్రతి గ్రామంలో ఏజెంట్లు ఉండే స్థాయికి పార్టీని తీసుకువచ్చానన్నారు. చంద్రబాబు, లోకేష్‌ల మీద అభిమానం సన్నగిల్లిందన్నారు. నాలుగేళ్లుగా ఏనాడూ చంద్రబాబు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు సతీష్ రెడ్డి. గతంలో ఎవరిపై పోటీ చేశానో, ఎవరితో శత్రుత్వం చేశానో వారి నుంచే పిలుపు వచ్చిందని.. అందుకే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వైసీపీ పిలుపు తర్వాతే తెలుగుదేశం పార్టీ నేతలకు తాను గుర్తొచ్చానన్నారు సతీష్ రెడ్డి.

ఇటీవల వైసీపీ నేతలు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్‌ రెడ్డి సతీష్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు S.V. సతీష్ రెడ్డి. అయితే ఇటీవల జనసేనతో కలిపి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన చంద్రబాబు.. పులివెందుల అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవికి కేటాయించారు.

First Published:  28 Feb 2024 12:51 PM GMT
Next Story