Telugu Global
Andhra Pradesh

టీడీపీకి షాక్.. గంటా రాజీనామాను ఆమోదించిన స్పీకర్

గంటా తన పదవికి రాజీనామా చేసి దాదాపు మూడేళ్లు అయినప్పటికీ ఇంతవరకు ఆమోదించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయ‌న రాజీనామాను ఆమోదించారు.

టీడీపీకి షాక్.. గంటా రాజీనామాను ఆమోదించిన స్పీకర్
X

రాజ్యసభ ఎన్నికలకు ముందు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీకి షాక్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మూడేళ్ల కిందట ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కు తన రాజీనామా లేఖను అందించారు. అయితే అప్పుడు గంటా రాజీనామా లేఖను ఆమోదించని స్పీకర్ ఇప్పుడు ఆమోదించి రాజ్యసభ ఎన్నికల వేళ టీడీపీకి పెద్ద షాకే ఇచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మూడేళ్ల కిందట భారీగా ఉద్యమించారు. ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. 2021 ఫిబ్రవరి 6న తన పదవికి రాజీనామా చేసిన గంటా.. రాజీనామా లేఖను స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందించారు.

అయితే గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయలేదని అప్పట్లో వైసీపీ విమర్శలు చేసింది. దీంతో గంటా 2021 ఫిబ్రవరి 12న స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖ అందజేసి వెంటనే ఆమోదించాలని కూడా స్పీకర్ ను కోరారు. అయితే గంటా తన పదవికి రాజీనామా చేసి దాదాపు మూడేళ్లు అయినప్పటికీ ఇంతవరకు ఆమోదించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయ‌న రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

ఈనెల 22న గంటా రాజీనామాను ఆమోదించినట్లు అసెంబ్లీ జనరల్ డాక్టర్ పీపీకే రామాచార్యులు ఇవాళ ప్రకటించారు. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లు ప్రచారం జరుగుతోంది.

రాజ్యసభ ఎన్నికలవేళ టీడీపీకి స్పీకర్ తమ్మినేని గట్టి దెబ్బే కొట్టారని ప్రచారం జరుగుతోంది. కాగా, గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొన్నాళ్లపాటు టీడీపీలో క్రియాశీలకంగా లేని గంటా కొన్ని నెలలుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు.

First Published:  23 Jan 2024 3:31 PM GMT
Next Story