Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఎన్డీయే కూటమికి షాక్.. టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

విజయనగరం జిల్లాలో టీడీపీ రెబల్ అభ్యర్థి అయిన మీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో కూటమి నేతలు గాబరా పడుతున్నారు.

ఏపీలో ఎన్డీయే కూటమికి షాక్.. టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
X

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణకు గడువు ఇవాళ మధ్యాహ్నం ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్, ఇండిపెండెంట్లకు గుర్తులను కేటాయిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయనగరంలో ఎన్డీయే కూటమికి షాక్ తగిలేలా ఎన్నికల అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రెబల్ అభ్యర్థి అయిన మీసాల గీతకు ఎన్నికల అధికారులు జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసు గుర్తును కేటాయించారు.

గాజు గ్లాసు జనసేన సింబల్‌గా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత ఎన్నికల్లో జనసేనకు పోలైన ఓట్ల శాతం కారణంగా ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తు కోల్పోయింది. జనసేన స్వయంగా పోటీ చేసే స్థానాల్లో మాత్రమే గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ప్రస్తుతం పొత్తులో భాగంగా జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరైనా ఇండిపెండెంట్లు తమకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కోరితే ఎన్నికల అధికారులు వారికి ఆ గుర్తును కేటాయిస్తున్నారు.

ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో టీడీపీ రెబల్ అభ్యర్థి అయిన మీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో కూటమి నేతలు గాబరా పడుతున్నారు. జనసేన పోటీ చేయని చోట ఆ పార్టీకి చెందిన ఓట్లు బీజేపీ లేదా టీడీపీకి పడాల్సి ఉంది. అయితే ఇండిపెండెంట్లు గాజు గ్లాస్ గుర్తు పొందితే జనసేన ఓట్లు వీరికి పోల‌య్యే అవకాశాలు ఉన్నాయి.

మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయం కారణంగా తమ అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం రూల్స్ ప్రకారమే రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించినట్లు వివరిస్తున్నారు.

First Published:  29 April 2024 1:02 PM GMT
Next Story