Telugu Global
Andhra Pradesh

ఇందులో కూడా చంద్రబాబుదే రికార్డా?

ఒక్కరోజులో చంద్రబాబుకు సంబంధించిన పిటీషన్లు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎనిమిది కేసులు హియరింగ్ జరగటం పెద్ద రికార్డు. ఇదే పెద్ద రికార్డంటే ఇంతకుమించిన రికార్డు మరోటుంది. అదేమిటంటే మూడు కోర్టుల్లో కలిపి చంద్రబాబు తరపున 58 మంది లాయర్లు వాదనలకు సిద్ధమవ్వటం.

ఇందులో కూడా చంద్రబాబుదే రికార్డా?
X

ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు తరచూ ఒకమాట అనేవారు. అదేమిటంటే ఏ కార్యక్రమాన్ని టేకప్ చేసినా దేశంలో ఎక్కడా లేదని తన హయాంలోనే జరుగుతున్నట్లు చెప్పేవారు. దేశంలోనే ఏపీ రికార్డు సృష్టించిందని ఒకటే ఊదరగొట్టేవారు. అలాంటిది 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి కూడా రికార్డే. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోవటం కూడా రికార్డే అని వైసీపీ వాళ్ళు సెటైర్లు వేసేవారు. అలాంటిది తాజాగా చంద్రబాబు మరో రికార్డును సృష్టించారనే చెప్పాలి.

ఇంతకీ ఇప్పుడు రికార్డు ఏమిటంటే.. కోర్టుల్లో కేసుల విషయంలో ఏకకాలంలో మూడు కోర్టుల్లో కేసుల మీద కేసుల్లో పిటీషన్లు వేయటం కూడా రికార్డనే చెప్పాలి. గతంలో ఎవరు కూడా ఇన్ని కోర్టుల్లో ఇన్నేసి పిటీషన్లు వేయలేదు. ఒక్కరోజులో చంద్రబాబుకు సంబంధించిన పిటీషన్లు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎనిమిది కేసులు హియరింగ్ జరగటం పెద్ద రికార్డు. ఇదే పెద్ద రికార్డంటే ఇంతకుమించిన రికార్డు మరోటుంది. అదేమిటంటే మూడు కోర్టుల్లో కలిపి చంద్రబాబు తరపున 58 మంది లాయర్లు వాదనలకు సిద్ధమవ్వటం.

చంద్రబాబు తరపున ఏసీబీ, సుప్రీంకోర్టుల్లో నలుగురేసి లాయర్లు వాదనలు వినిపించటం కూడా రికార్డే. ఇంతమంది లాయర్లు వాదనలకు సిద్ధమవ్వగానే ఏబీసీ కోర్టు, సుప్రీంకోర్టులో జడ్జీలే ఆశ్చర్యపోయారు. కోర్టు హాలులో లాయర్లను చూసిన ఏసీబీ కోర్టు జడ్జి బిత్తరపోయారు. కోర్టు హాలులోని లాయర్లను చూపిస్తు చంద్రబాబు కేసుని ఎంతమంది వాదిస్తారని అడిగారు. దానికి సిద్దార్థ‌ లూథ్రా సమాధానమిస్తూ ముగ్గురం మాత్రమే వాదిస్తామని చెప్పారు. దాంతో మిగిలిన లాయర్లందరినీ ఒక పక్కన కూర్చోమని జడ్జీ చెప్పారు.

ఇలాంటి అనుభవమే సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా ఎదురైంది. కోర్టు హాలులో లాయర్లను చూసిన జడ్జీ చంద్రబాబు తరపున ఎంతమంది వాదిస్తారని వర్చువల్‌గా ఉన్న హరీష్ సాల్వేని అడిగారు. హాజరైన లాయర్లందరు కాదని తనతో పాటు లూథ్రా, అభిషేక్ మనుసింఘ్వి మాత్రమే వాదిస్తామని సమాధానమిచ్చారు. అంటే కోర్టేదైనా సరే చంద్రబాబు తరపున వాదించటానికి ఎంతమంది లాయర్లు సిద్ధమయ్యారో అర్థంచేసుకోవచ్చు.

అందుబాటులోని సమాచారం ప్రకారం మొత్తం 58 మంది లాయర్లు చంద్రబాబు కేసులను వాదిస్తున్నారట. లూథ్రా, హరీష్ సాల్వే, సింఘ్వి లాంటి లాయర్లు రోజుకు సుమారు రూ.1-1.5 కోట్లు ఫీజులు వసూలు చేస్తారు. అలాగే మరికొందరు లాయర్లు రోజుకు రూ.10 లక్షలు, ఇంకొందరు రోజుకు రూ. 2-5 లక్షల మధ్యలో వసూలు చేసే లాయర్లున్నారట. వీళ్ళ ఫీజులను బట్టే గడచిన నెల రోజులుగా లాయర్లకు టీడీపీ ఎంత మొత్తం చెల్లించిందో ఎవరికి వాళ్ళే లెక్కేసుకోవాలి. బహుశా ఇది కూడా రికార్డేనేమో.

First Published:  11 Oct 2023 6:36 AM GMT
Next Story