Telugu Global
Andhra Pradesh

మొత్తం ఎన్టీయార్ జపమేనా?

నిజం గెలవాలి యాత్రలో రాజకీయాలు మాట్లాడటానికి తాను రాలేదని అంటూనే మొత్తం రాజకీయాలే మాట్లాడారు. రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో పెట్టారని భువనేశ్వరి చెప్పటమే విచిత్రంగా ఉంది.

మొత్తం ఎన్టీయార్ జపమేనా?
X

మొత్తానికి భువనేశ్వరికి తండ్రి ఎన్టీయార్ గుర్తుకొచ్చారు. నిజం గెలవాలి అనే స్లోగన్‌తో భువనేశ్వరి యాత్రను ప్రారంభించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబునాయుడు అరెస్టయి రిమాండుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక కొందరు చనిపోయారట. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి బస్సుయాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్రను ఆమె చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లి నుండి ప్రారంభించారు. తర్వాత అగరాల, తిరుపతి, శ్రీకాళహస్తి సభల్లో మాట్లాడారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భువనేశ్వరి యాత్ర మొత్తం ఎన్టీయార్ జపం చేయటంతోనే సరిపోయింది. చంద్రబాబు వెన్నుపోటును తట్టుకోలేక ఎన్టీయార్ మానసిక క్షోభకు గురై చనిపోయిన విషయం తెలిసిందే. పదవిలో నుండి దింపేసిన తర్వాత ఎన్టీయార్ మంచాన పడటం ఆ తర్వాత చనిపోవటం ఇలా అడుగడుగునా చంద్రబాబు ద్రోహంలో భువనేశ్వరి పాత్ర కూడా ఉందని వైసీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న భువనేశ్వరి తన యాత్రను ఎన్టీయార్ విగ్రహానికి పూలమాల వేసి మొదలుపెట్టారు.

ప్రజలే దేవుళ్ళని చెప్పిన ఎన్టీయార్ పేరుతోనే ట్రస్టు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్టీయార్ ట్రస్టుతో సామాన్య‌ జనాలకు ఏం సంబంధమో భువనేశ్వరి చెప్పలేదు. ఎన్టీయార్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారట. తెలుగువాళ్ళ పౌరుషం అంటే ఏమిటో ఎన్టీయార్ తెలియజేశారట. ఎన్టీయార్ ఎప్పుడూ సత్యాన్నే నమ్ముకున్నట్లు చెప్పారు. తన తండ్రి గురించి ఇంత ఘనంగా చెప్పుకున్న భువనేశ్వరి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిలో నుండి తండ్రిని ఎందుకు దింపేశారో కూడా చెబితే బాగుండేదని నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

నిజం గెలవాలి యాత్రలో రాజకీయాలు మాట్లాడటానికి తాను రాలేదని అంటూనే మొత్తం రాజకీయాలే మాట్లాడారు. రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో పెట్టారని భువనేశ్వరి చెప్పటమే విచిత్రంగా ఉంది. రాష్ట్రాన్ని జైలులో పెట్టడం ఏమిటి? న్యాయాన్ని జైలులో పెట్టడం ఏమిటో ఆమె వివరిస్తే బాగుండేది. చంద్రబాబును రిమాండుకు పంపిందే న్యాయస్థానం అయితే మళ్ళీ న్యాయాన్ని జైలులో పెట్టడం ఏమిటి? చంద్రబాబును జైలులో పెట్టారు కాబట్టి జనాలంతా తమకు మద్దతుగా నిలబడాలని భువనేశ్వరి అడగటమే విచిత్రంగా ఉంది. అంటే ఇంతవరకు జనాలు చంద్రబాబు అరెస్టును పట్టించుకోలేదని ఆమె మాటల్లోనే అర్థ‌మైపోతోంది.

First Published:  26 Oct 2023 6:31 AM GMT
Next Story