Telugu Global
Andhra Pradesh

వైఎస్ కుటుంబంలో ఎవరిది పైచేయి..?

వివేకానందరెడ్డి మర్డర్ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. అవినాష్ ను సీబీఐ ఎప్పుడైనా అరెస్టుచేయచ్చనేట్లుగా ఉంది వాతావరణం.

వైఎస్ కుటుంబంలో ఎవరిది పైచేయి..?
X

తాజా పరిణామాల నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వైఎస్ కుటుంబంలో రెండు పేర్లు చాలా ప్రముఖంగా మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ పేర్లు ఏమిటంటే.. వైఎస్ అభిషేక్ రెడ్డి, వైఎస్ అనీల్ రెడ్డి. ఇద్దరూ జగన్మోహన్ రెడ్డికి వరసకు సోదరులే అవుతారు. ఇద్దరికీ జగన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు ఇద్దరు జగన్ కోసమే పనిచేస్తున్నారు. దాంతో ఇద్దరిలో వచ్చే ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.

అభిషేక్ రెడ్డి వృత్తిరీత్యా డాక్టర్. ఈయన భార్య కూడా డాక్టరే. ఇద్దరు విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. అయితే హఠాత్తుగా జగన్ క్యాంపు ఆఫీసులోనూ, పులివెందులలో ఎక్కువగా కనబడుతున్నారు. డాక్టర్ కు జగన్ పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల మండలాల ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారట. దాంతో డాక్టర్ రెగ్యులర్ గా మండలాల్లో తిరుగుతున్నారు. వైజాగ్ లో ఉన్న డాక్టర్ ను సడన్ గా ఎందుకు పిలిపించి పార్టీ బాధ్యతలను అప్పగించారో అర్థంకావటంలేదు.

ఇక రెండో వ్యక్తి అనీల్ రెడ్డి. ఈయన చెన్నైలో ఎంబీఏ చేశారట. చాలాకాలంగా తాడేపల్లి క్యాంపు ఆఫీసు వ్యవహారాలు చూసుకుంటున్నారు. జగన్ ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో చాలా కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. జగన్ తరపున ఢిల్లీలో కొందరు ముఖ్యులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారట. ఇప్పుడు సడన్ గా వీళ్ళిద్దరిపైన ప్రచారం ఎందుకు మొదలైందంటే రాబోయే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థులుగానే అని సమాచారం.

వివేకానందరెడ్డి మర్డర్ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. అవినాష్ ను సీబీఐ ఎప్పుడైనా అరెస్టుచేయచ్చనేట్లుగా ఉంది వాతావరణం. ఇప్పుడు సమస్య సీబీఐ అరెస్టుచేయటంకాదు. ఎందుకంటే అరెస్టయితే కొంతకాలం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. కానీ వచ్చేఎన్నికల్లోగా వివేకా మర్డర్ కేసులో నుండి అవినాష్ బయటపడకపోతే పార్టీ ఇమేజికి దెబ్బని జగన్ ఆలోచిస్తున్నారట. అందుకనే అభిషేక్, అనీల్ ఇద్దరిలో ఒకరిని అవినాష్ కు రీప్లేస్‌మెంట్ గా జగన్ ఆలోచిస్తున్నారట. మరి ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో అనే ప్రచారం పెరిగిపోతోంది.

First Published:  9 May 2023 5:24 AM GMT
Next Story