Telugu Global
Andhra Pradesh

తెలంగాణ ఉపఎన్నికపై ఏపీలో బెట్టింగా..?

ఇప్పుడు ఎన్నికల్లో గెలుపోటముల మీద కూడా బెట్టింగులు మొదలయ్యాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మాత్రం బెట్టింగ్రాయుళ్లు చాలా అడ్వాన్సయిపోయారట.

తెలంగాణ ఉపఎన్నికపై ఏపీలో బెట్టింగా..?
X

వినటానికి నమ్మేట్లుగా లేకపోయినా జరుగుతున్నది మాత్రం ఇదే. తెలంగాణాలో మొదలైన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ పై ఏపీలో బెట్టింగులు జోరందుకున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, గుంటూరు ప్రధాన కేంద్రాలుగా బెట్టింగ్ రాయుళ్లుచాలా బిజీ అయిపోయారట. ఎక్కడ కూడా డైరెక్టుగా డబ్బులు చేతులుమారకుండా అంతా ఆన్ లైన్ విధానంలోనే బెట్టింగ్ జరుగుతోందని సమాచారం. మామూలుగా క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగులు జరుగుతాయని అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఎన్నికల్లో గెలుపోటముల మీద కూడా బెట్టింగులు మొదలయ్యాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మాత్రం బెట్టింగ్రాయుళ్లు చాలా అడ్వాన్సయిపోయారట. ఎలాగంటే గెలుపోటములు ఎవరిది అనికాకుండా గెలిచే అభ్యర్ధికి ఇన్ని ఓట్లువస్తాయి, ఓడిపోయిన అభ్యర్ధికి ఇన్ని ఓట్లొస్తాయని బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మూడో ప్లేసులో ఎవరొస్తారు..? అనేది ఒక పాయింట్ అయితే ఆ అభ్యర్ధికి ఎన్ని ఓట్లొస్తాయని కూడా బెట్టింగ్ జరుగుతోందట.

ఇవన్నీ ఫైనల్ రిజల్టుకు సంబంధించిన బెట్టింగు అయితే ఇప్పుడు మొదలైన పోలింగ్ మీద కూడా బెట్టింగులు మొదలైపోయాయట. మొత్తంమీద ఎంతపోలింగ్ జరుగుతుంది..? ఏ మండలంలో ఎన్ని ఓట్లుపోలవుతాయి..? పోలయ్యే ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లొస్తాయనే విషయాలపైన కూడా బెట్టింగులు ఊపందుకుంటున్నాయి. క్రికెట్ లో ఓవర్ ఓవర్ కు బెట్టింగులు కట్టడం పాతపడిపోయి ఇప్పుడు బాల్ బాల్ మీద బెట్టింగులు నడుస్తున్నాయి.

ఇప్పుడు మునుగోడులో కూడా ఇదే పద్దతిలో బెట్టింగులు జోరందుకుంటోంది. ఓవరాల్ పోలింగ్, మండలాల వారీగా జరగబోయే పోలింగ్ మీద కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇవన్నీ గ్రహించిన ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే కొందరు బుక్కీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాళ్ళద్వారా మిగిలిన బెట్టింగ్ రాయుళ్ల పనిపట్టాలని అనుకుంటున్నారట. అయితే మునుగోడు వేదికగా జరుగుతున్న బెట్టింగుల్లో ఎవరూ ఎక్కడా ప్రత్యక్షంగా కనబడటంలేదు. బెట్టింగ్ రాయుళ్ళంతా ఒక రింగుగా ఏర్పడి ఎక్కడెక్కడో కూర్చుని బెట్టింగు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణ ఉపఎన్నికపై ఏపీలో బెట్టింగు జరగటమే విచిత్రంగా ఉంది.

First Published:  3 Nov 2022 3:50 AM GMT
Next Story