Telugu Global
Andhra Pradesh

డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం.. 10 వేల మంది హాజరవుతారన్న వైసీపీ

ఎన్నికలకు ముందు నుంచే బీసీల గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. బీసీల జీవన విధానంలో మార్పులు తీసుకొని రావాలనే ఉద్దేశంతో జగన్ ఒక డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని మంత్రి చెల్లుబోయిన గుర్తు చేశారు.

డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం.. 10 వేల మంది హాజరవుతారన్న వైసీపీ
X

బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలని ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. డిసెంబర్ 8న విజయవాడ వేదికగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రకటించారు. ఈ సదస్సుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరవుతారని ఆయన తెలిపారు. శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కేబినెట్‌లోని బీసీ మంత్రులు, కీలక నేతలతో సమావేశం అయ్యారు. దీనికి సంబంధించిన విశేషాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.

ఎన్నికలకు ముందు నుంచే బీసీల గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. బీసీల జీవన విధానంలో మార్పులు తీసుకొని రావాలనే ఉద్దేశంతో జగన్ ఒక డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 139 బీసీ కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకొని వచ్చి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు. రాబోయే రోజుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధ్యయనం చేస్తున్నామని అన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు.

బీసీల ఆత్మీయ సమ్మేళనంలో వైసీపీ ప్రభుత్వం వారి గౌరవాన్ని ఎలా పెంచిందో వివరిస్తామని అన్నారు. ఇది బీసీల ప్రభుత్వమని.. గతంలో బీసీ వర్గాలన్నీ వైఎస్ జగన్‌కు అండగా నిలబడటంతోనే చంద్రబాబు 23 స్థానాలకు పరిమితం అయ్యారని గుర్తు చేశారు. సీఎం జగన్ హయాంలో బీసీ కుటుంబాలకు జరిగిన మేలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీసీ వర్గాలే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మరో సారి గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థులకు చంద్రబాబు 1995లో కూడా ఏమీ చేయకపోవడం వల్లే సాఫ్ట్‌వేర్ బూమ్‌లో అవకాశాలు చేజిక్కించుకోలేక పోయారని మంత్రి ఆరోపించారు.

దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో ఏపీ ఒకటే బీసీల రాష్ట్రమని మంత్రి గుమ్మునూరు జయరాం అన్నారు. విజయవాడలో 8న ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సదస్సులో గ్రామ సర్పంచ్ నుంచి మంత్రుల వరకు పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రిని కూడా సదస్సుకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. బీసీలందరికీ దిశానిర్దేశం చేయాలని సీఎంను కోరామని జయరాం చెప్పారు. మూడున్నర ఏళ్లలో బీసీ వర్గాలకు రూ. 88 వేల కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. చంద్రబాబు కనీసం రూ. 500 కోట్లు ఖర్చు చేయగలరా అని ప్రశ్నించారు. బీసీల ఆత్మీయ సమ్మేళనానికి 10 వేల మంది ప్రజాప్రతినిధులు వస్తారని ఆయన తెలిపారు.

చంద్రబాబు బీసీలపై చూపించిన అహంభావాన్ని బీసీ వర్గాలు మర్చిపోవని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తోకలు కత్తిరిస్తామంటూ ఆయన బీసీలను అవమానించారని గుర్తు చేశారు. చంద్రబాబు తన హయాంలో బీసీలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. 75 ఏళ్ల భారత స్వాతంత్ర చరిత్రలో తొలి సారి రాజమండ్రి ఎంపీ సీటును వైఎస్ జగన్ బీసీలకు ఇచ్చారని ఆయన చెప్పారు. బీసీలకు మరింత మేలు చేయాలని సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని ఆయన అన్నారు.

First Published:  26 Nov 2022 11:10 AM GMT
Next Story