Telugu Global
Andhra Pradesh

పవన్‌కు బీసీల బంపరాఫర్

జనసేన ఆఫీస్‌లో బీసీల సంక్షేమంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన కొందరు టీడీపీ, బీజేపీని వదిలేసి బీసీలతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. అందరం కలిస్తే అధికారంలోకి రావటం చాలా తేలికని కూడా పవన్‌కు చెప్పారు.

Andhra Pradesh BC leaders gave a bumper offer to Pawan Kalyan
X

పవన్‌కు బీసీల బంపరాఫర్

జనసేన ఆఫీస్‌లో బీసీల సంక్షేమంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కే బంపరాఫర్ లభించింది. బీసీలనేది ఒక విస్తృతమైన పదం. బీసీ సామాజికవర్గాలంటే సుమారు 140 ఉపకులాల సమాహారం. మరి పవన్ సంక్షేమంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్ని ఉపకులాలకు చెందిన సంఘాల నేతలు పాల్గొన్నారో స్పష్టంగా తెలియ‌దు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు లాంటి సీనియర్లు కొందరు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మాట్లాడిన కొందరు టీడీపీ, బీజేపీని వదిలేసి తమతో చేతులు కలపాలని పవన్‌కు బంపరాఫర్ ఇచ్చారు. పై రెండు పార్టీలను వదిలేసి బీసీలతోనే పొత్తు పెట్టుకోవాలని సూచించారు. అందరం కలిస్తే అధికారంలోకి రావటం చాలా తేలికని కూడా పవన్‌కు చెప్పారు. అయితే బంపరాఫర్ ఇచ్చిన నేతల స్థాయి ఏమిటి? వాళ్ళకి బీసీ సామాజికవర్గంలో ఎంత పట్టుంది? నిజంగానే పవన్ బీజేపీ, టీడీపీలను వదిలేసి వస్తే ఇప్పుడు ఆఫర్ ఇచ్చిన నేతలు జనసేనకు ఎంతవరకు ఉపయోగపడతారన్నది తెలియ‌దు.

ఇక మరో నేతయితే బీసీలందరినీ కలుపుకుని జనసేనను పవన్ మహాసేనగా మార్చాలన్నారు. జనసేన మహాసేనగా మారిస్తే కానీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెప్పేశారు. ఏ ఉద్దేశంతో బీసీల సమావేశాన్ని పవన్ పెట్టారో తెలీదు కానీ సమావేశం మొదలైన చాలాసేపటి వరకు పవన్ రాలేదు.

ఇక్కడే చాలామంది బీసీ నేతల్లో అసంతృప్తి కనబడింది. బీసీల సంక్షేమం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆహ్వానాలు పంపిన పవన్ తీరా సమావేశం మొదలయ్యేటప్పుడు లేకపోవటం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. పవన్ వచ్చేంత వరకు నాదెండ్ల మనోహరే బీసీ నేతలతో చర్చలు జరిపారు. వాళ్ళు చెప్పిన సమస్యలను, పరిష్కారాలను నోట్ చేసుకున్నారు. తర్వాత ఎప్పుడో జాయిన్ అయిన పవన్‌కు తాను నోట్ చేసుకున్న విషయాలను నాదెండ్ల వివరించారు. బీసీల్లోని మేధావులతో మరోసారి సమావేశం అవ్వాలని పవన్ అభిప్రాయపడ్డారు. మరి రెండో సమావేశం తర్వాత ఏమైనా తీర్మానం చేస్తారేమో చూడాలి.

First Published:  12 March 2023 5:42 AM GMT
Next Story