Telugu Global
Andhra Pradesh

బాలయ్యకు భలే చిక్కొచ్చిందే.. కాల మహిమ

జనసేన అన్నా పవన్ అన్నా బాలయ్యకు తగని మంటన్న విషయం అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు జనసేనను, పవన్‌ను అదేపనిగా పొగడాల్సొచ్చింది.

బాలయ్యకు భలే చిక్కొచ్చిందే.. కాల మహిమ
X

తెలుగుదేశం పార్టీ హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు భలే చిక్కొచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే హిందుపురం నియోజకవర్గంలో బాలయ్య రెండు రోజులు పర్యటించారు. ఈ రెండు రోజులు కూడా టీడీపీ, జనసేన నేతలతో కలిసే సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాల సందర్భంగా జై జనసేన, జై పవన్ కల్యాణ్ అంటు చాలాసార్లు నినాదాలిచ్చారు. టీడీపీ-జనసేన కలిసి పనిచేయకపోతే గెలుపు కష్టమని అభిప్రాయపడ్డారు. టీడీపీ కష్టాల్లో ఉన్నపుడు అండగా నిలిచిన పవన్‌కు బాలయ్య ధన్యవాదాలు చెప్పారు.

జనసేన, పవన్‌ను ఉద్దేశించి బాలయ్య తాజా మాటలు వింటుంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇదే బాలయ్య ఒకప్పుడు.. ఇదే జనసేనను అలాగా జనాల పార్టీగా అభివర్ణించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఒక సమావేశంలో జనసేన నేతలు, క్యాడర్‌ను బాలయ్య సంకరజాతి నా...లు అంటు తీవ్రంగా మండిపడ్డారు. జనసేన అన్నా పవన్ అన్నా బాలయ్యకు తగని మంటన్న విషయం అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు జనసేనను, పవన్‌ను అదేపనిగా పొగడాల్సొచ్చింది.

రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే టీడీపీ+జనసేన పార్టీలు కలిసుండాల్సిన అవసరాన్ని కూడా బాలయ్య పదేపదే చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు జనసేనను ఒక రాజకీయ పార్టీగా గుర్తించటానికి కూడా ఇష్టపడలేదు. తెలుగుదేశం పార్టీకి జనసేనకు అసలు పోలికేంటి అని ఎన్నోసందర్భాల్లో మండిపడ్డారు. జనసేనను ఉద్దేశించి గాలికొచ్చిన పార్టీ గాలికి కొట్టుకుని పోయే పార్టీ అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. పార్టీ పెట్టడం, నడపటం, అధికారంలోకి రావటం తమ వల్లే అవుతుంది కానీ చిరంజీవి, పవన్ వల్ల ఏమవుతుందని ఎదురు ప్రశ్నించిన విషయం గుర్తుండే ఉంటుంది.

అంటే ఈ మాటలన్నీ ఇప్పుడు బాలయ్య మరచిపోయినట్లు నటిస్తున్నా చరిత్రలో రికార్డు అయి ఉన్నాయి. అలాగే జనసేనపై బాలయ్య కామెంట్లని కొడితే యూట్యూబ్‌లో కుప్పలు కుప్పలుగా దొరకుతాయి. మొత్తానికి ఒకప్పుడు ఈసడించుకున్నపార్టీని, తానే మళ్ళీ పొగడాల్సి వస్తుందని, అదే పవన్‌ను భుజాన మోయాల్సొస్తుందని బాలయ్య అప్పట్లో ఏమాత్రం అనుకునుండరు. చివరకు జనసేన కండువాను భుజానేసుకుని మాట్లాడారు. దాన్నే కాలమహిమ అని అంటారు. ఏం చేస్తాం, ఎలాంటి వారైనా కాలానికి అనుగుణంగా, కాలం చెప్పినట్లు వినకతప్పదు కదా.


First Published:  17 Nov 2023 4:59 AM GMT
Next Story