Telugu Global
Andhra Pradesh

బెయిల్ పిటిషన్ ఉపసంహరణ.. ట్విస్ట్ ఇచ్చిన అవినాష్ రెడ్డి

అసలు అవినాష్ పిటిషన్ ఎందుకు వేసినట్టు, ఎందుకు ఉపసంహరించుకున్నట్టు.. సీబీఐ తనను అరెస్ట్ చేయదని ఆయన డిసైడ్ అయ్యారా..? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

బెయిల్ పిటిషన్ ఉపసంహరణ.. ట్విస్ట్ ఇచ్చిన అవినాష్ రెడ్డి
X

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కావాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 24 గంటలు తిరక్కముందే ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. అసలు అవినాష్ పిటిషన్ ఎందుకు వేసినట్టు, ఎందుకు ఉపసంహరించుకున్నట్టు.. సీబీఐ తనను అరెస్ట్ చేయదని ఆయన డిసైడ్ అయ్యారా..? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

వైఎస్ వివేకా హత్యకేసు విచారణకు సంబంధించి ఈరోజు కీలక పరిణామం జరిగింది. విచారణ అధికారిగా ఉన్న రామ్ సింగ్ ని తొలగించి, కేఆర్ చౌరాసియా నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమించింది సీబీఐ. సుప్రీంకోర్టు సిట్ కి ఆమోదం తెలిపింది. అంతే కాదు, ఏప్రిల్ 30తో విచారణ ముగించాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. ఈ పరిణామం తర్వాత అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి, వాంగ్మూలం కూడా ఇచ్చారు. కావాలనే తనను సీబీఐ ఈ కేసులో ఇరికించిందని, విచారణ పేరుతో వేధిస్తోందని, సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు చేశారు అవినాష్ రెడ్డి. మరోవైపు ఈ కేసులో నిందితుడుగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య సీబీఐ దర్యాప్తు అధికారిని మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం సూచనలతో సీబీఐ దర్యాప్తు అధికారిని మార్చేసింది.

దర్యాప్తు అధికారి మారడంతో వివేకా హత్యకేసు త్వరగా ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా డెడ్ లైన్ పెట్టడంతో ఆలోగా కేసు ముగించేస్తారని అంటున్నారు. అయితే తనను అరెస్ట్ చేస్తారేమోననే అనుమానంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి, అర్థాంతరంగా దాన్ని ఉపసంహరించుకోవడమే ఈ కేసులో పెద్ద ట్విస్ట్. సీబీఐ తనను అరెస్ట్ చేయదని అవినాష్ రెడ్డికి అంత నమ్మకం ఎందుకు కలిగిందో తేలాల్సి ఉంది.

First Published:  29 March 2023 4:50 PM GMT
Next Story