Telugu Global
Andhra Pradesh

కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్లు ఏంటి..? అవినాష్ పై హైకోర్టు ఆగ్రహం..!

సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ అందించింది.

కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్లు ఏంటి..? అవినాష్ పై హైకోర్టు ఆగ్రహం..!
X

వైఎస్ వివేకానందరెడ్డి రెండో పెళ్లి కోసం మహ్మద్ అక్బర్ గా పేరు మార్చుకున్నారంటూ రెండు రోజల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సీబీఐ విచారణ తర్వాత బయటకొచ్చిన ఆయన ప్రెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతే అసలు కథ పూర్తిగా మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులంతా వరుసగా రియాక్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి నిర్దోషి అని, ఇన్నాళ్లూ కుటుంబ పరువు కాపాడటం కోసం ఆయన సైలెంట్ గా ఉన్నారని, ఇన్నాళ్లకు జనాలకు నిజం చెప్పడానికే ఆయన నోరు తెరిచారని చెప్పుకొచ్చారు. సాక్షి మీడియా కూడా అదే విషయాన్ని హైలెట్ చేస్తూ.. వివేకా కుటుంబాన్నే టార్గెట్ చేసింది. దీంతో సహజంగానే ఈ కేసు వ్యవహారంలో సామాన్య జనం ఆలోచనలో పడ్డారు. అయితే ఈ ప్రెస్ మీట్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కేసు విచారణలో ఉండగా సీబీఐ విచారణ తర్వాత ఆఫీస్ ముందే ప్రెస్ మీట్ ఎందుకని ప్రశ్నించినట్టు సమాచారం.

ఆధారాలు ధ్వంసం చేశారా..?

సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ అందించింది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేస్తున్నట్లు సీబీఐ, కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్ పాత్ర ఉందని.. ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది సీబీఐ. అయితే తీర్పు వెల్లడించే వరకు అవినాష్‌ ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశిస్తూ కోర్టు తీర్పుని రిజర్వ్‌ చేసింది.

భాస్కర్ రెడ్డిని కడపకు పిలిపించారా..?

అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణకోసం కడపలో వేచి చూసి తిరిగి వెళ్లిపోయారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. కేసు విచారణ హైదరాబాద్ కి బదిలీ అయితే ఆయన్ను కడప ఎందుకు పిలిపించారంటూ సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. కడపలో విచారణకు తాము పిలవలేదని సీబీఐ తెలిపింది.

First Published:  13 March 2023 2:32 PM GMT
Next Story