Telugu Global
Andhra Pradesh

అవినాష్ అప్ డేట్: సీబీఐ విచారణ, బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, బెయిల్ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది.

అవినాష్ అప్ డేట్: సీబీఐ విచారణ, బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
X

అవినాష్ అప్ డేట్: సీబీఐ విచారణ, బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఈరోజు 3.30 గంటలకు సీబీఐ విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే విచారణ కోసం పులివెందుల నుంచి హైదరాబాద్ చేరుకున్న అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని, ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.


ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ విషయంలో మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులిచ్చింది. ఈరోజు అవసరం లేదని, రేపు ఉదయం 10.30గంటలకు సీబీఐ ఆఫీస్ కి రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన కారణంగానే ఆయన విచారణను సీబీఐ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని అవసరమైతే అరెస్ట్ చేస్తామని సీబీఐ కోర్టుకి తెలిపింది.

విచారణ కూడా వాయిదా..

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు సీబీఐ, అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని కోరిన విషయం తెలిసిందే. అయితే కోర్టు విచారణ రేపు మధ్యాహ్నం ప్రారంభమవుతున్నందున.. విచారణను సాయంత్రం 4 గంటల తర్వాత చేపట్టాలని హైకోర్టు సీబీఐకి సూచించింది.

అవినాష్ అంత మాట అన్నారా..?

మరోవైపు అవినాష్ బెయిల్ పిటిషన్ లో వైఎస్ వివేకాపై సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో సీబీఐ విచారణకు హాజరైన సందర్భంలో వివేకా రెండో పెళ్లి గురించి మీడియాకు చెప్పారు అవినాష్ రెడ్డి.


తాజాగా వివేకాకు మరో ఇద్దరు మహిళలతో సంబంధాలున్నట్టు బెయిల్ పిటిషన్లో ఆయన పేర్కొన్నట్టు వార్తలొస్తున్నాయి. నిందితులతో కలసి డైమండ్స్ వ్యాపారం కూడా చేశారని అవినాష్ రెడ్డి ఆరోపించినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో కొనసాగిన ఉత్కంఠ రేపటికి వాయిదా పడింది.

First Published:  17 April 2023 11:36 AM GMT
Next Story