Telugu Global
Andhra Pradesh

ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు..?

బీఆర్ఎస్ రాకను చూసి భయపడుతున్న కొందరు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ప్రారంభోత్సవం రోజే విద్వేషం చిమ్మారు.

ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు..?
X

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగన రోజే.. కొంతమంది వైరి వర్గాల వారు ఫ్లెక్సీలు చించేశారు, బోర్డ్ ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడి విషయంలో నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎందుకీ ఉక్రోషం..?

బీఆర్ఎస్ గా అవతరించిన తర్వాత ఇతర రాష్ట్రాలపై కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అక్కడి స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మహారాష్ట్రలో దాదాపు అన్ని నియోజకవర్గాలనుంచి బలమైన నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు, అక్కడి స్థానిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బోణీ కొట్టింది. తెలంగాణ అభివృద్ధి మోడల్ పై మహారాష్ట్రలో చర్చ జరుగుతోంది. ఇటు ఏపీలో కూడా బీఆర్ఎస్ ఉనికికోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తోట చంద్రశేఖర్ అధ్యక్షతన పార్టీలో చేరికలు కూడా జోరందుకున్నాయి. ఇప్పటికిప్పుడు ఏపీలో అధికారం బీఆర్ఎస్ వశమైపోతుందని చెప్పలేం కానీ.. పార్టీ ఉనికి చాటుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. ఏపీలో చంద్రబాబు పాలనను ప్రజలు చూశారు, జగన్ పాలనను కూడా బేరీజు వేసుకున్నారు. ఈ రెండిటితో పోల్చి చూస్తే తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలా ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు లాంటి పథకాలు ఏపీలో లేవు. తెలంగాణలో పారిశ్రామిక విప్లవం ఏ స్థాయిలో జరుగుతుందో, ప్రపంచ స్థాయి కంపెనీలు ఎందుకలా హైదరాబాద్ కి క్యూ కడుతున్నాయో కూడా అందరికీ తెలుసు. కచ్చితంగా ఆయా వర్గాలు తాము తెలంగాణలో ఉండి ఉంటే ఎంత బాగుండేదో అనుకోవడం ఖాయం. అలాంటి వారందరికీ ఏపీలో బీఆర్ఎస్ ఒక ఆశాజ్యోతిలా కనిపించి ఉండొచ్చు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కూడా కేంద్రంపై బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొచ్చిన స్థాయిలో స్థానిక రాజకీయ పార్టీల స్పందన లేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాకను చూసి భయపడుతున్న కొందరు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ప్రారంభోత్సవం రోజే విద్వేషం చిమ్మారు.

గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి రోడ్డులో బీఆర్ఎస్ నూతన కార్యాలయం ప్రారంభమైంది. త్వరలో జిల్లా కేంద్రాల్లో కూడా కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరిగే అవకాశముంది. ఒక జాతీయ పార్టీ రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో పార్టీ ఆఫీస్ లను ప్రారంభించడం, నాయకులను చేర్చుకోవడం సహజంగా జరిగే ప్రక్రియే. అంతమాత్రాన ఆ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ఎక్కడి సంప్రదాయం. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడిని ఖండించారు. పోలీస్ కేసు పెట్టారు.

First Published:  22 May 2023 3:03 PM GMT
Next Story