Telugu Global
Andhra Pradesh

అంబటిపై దాడి.. స్పందించాల్సింది పవనా..? జగనా..??

పవన్ కంటే ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఈ దాడిని ఖండించాలి కదా. వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా ఇలాంటి దాడి సరికాదని చెప్పాలి కదా..? అన్నిటికీ మించి సీఎం జగన్ ఈ దాడి సరికాదని ఓ స్టేట్ మెంట్ ఇవ్వాలి కదా..?

అంబటిపై దాడి.. స్పందించాల్సింది పవనా..? జగనా..??
X

మంత్రి అంబటిపై ఖమ్మంలో జరిగిన దాడిని ఖండిస్తున్నామంటూ వైసీపీ ర్యాలీలు తీస్తోంది. కులోన్మాద దాడుల్ని తిప్పికొట్టాలనే బ్యానర్లు పట్టుకుని నేతలు రోడ్లపైకొచ్చి నిరసన చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ తర్వాత వైసీపీ నేతలు చేస్తున్న నినాదాలే కాస్త విచిత్రంగా ఉన్నాయి. కాపులపై పవన్ కు ప్రేమ ఉంటే మంత్రి అంబటిపై జరిగిన దాడిని ఖండించాలంటున్నారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. అసలు అంబటిపై జరిగిన దాడిని ముందుగా ఖండించాల్సింది పవనా..? జగనా..? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.

పవన్ కు సంబంధమేంటి..?

వైసీపీ నేతలు కొన్నిసార్లు మేథావులుగా ప్రవర్తిస్తుంటారు, మరికొన్నిసార్లు మరీ అమాయకంగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఇప్పుడు అంబటి దాడి వ్యవహారంలో పవన్ స్పందించాలి అనే డిమాండ్ కూడా ఈ అమాయకత్వానికి నిదర్శనం. దాడి చేసింది ఫలానా సామాజికవర్గం వారు అని చెబుతున్నారు అంబటి. ఒకవేళ స్పందిస్తే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు దాన్ని ఖండించాలి. పోనీ ఆ ఫలానా సామాజిక వర్గానికి చెందిన పార్టీగా భావిస్తున్న టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది కాబట్టి.. పవన్ స్పందించాలి అనడంలో లాజిక్ ఉంది. కానీ పవన్ కంటే ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఈ దాడిని ఖండించాలి కదా. వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా ఇలాంటి దాడి సరికాదని చెప్పాలి కదా..? అన్నిటికీ మించి సీఎం జగన్ ఈ దాడి సరికాదని ఓ స్టేట్ మెంట్ ఇవ్వాలి కదా..?

గతంలో మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల సందర్భంలో కూడా సీఎం జగన్ నుంచి ఒక్క స్టేట్ మెంట్ కూడా రాలేదు, నిన్న అంబటిపై దాడి జరిగిన తర్వాత కూడా సీఎం జగన్ తరపున అధికారికంగా ఒక్క ప్రకటన కూడా లేదు. పోనీ పరామర్శలయినా ఉన్నాయో లేవో ఆ పార్టీ నాయకులకే తెలియాలి. సొంత పార్టీ నేతలు ఇబ్బందుల్లో పడితే ముందుగా స్పందించాల్సింది జగనా..? లేక పక్క పార్టీ అధ్యక్షుడు పవనా..? దాడిలో కులాన్ని లాక్కొచ్చినప్పుడే సింపతీ వ్యవహారం ఆవిరైపోయింది. ఇప్పుడు పవన్ ని వేలెత్తి చూపిస్తూ ఆ వ్యవహారాన్ని మరింత పలుచన చేస్తున్నారు వైసీపీ నేతలు.

First Published:  29 Oct 2023 2:23 AM GMT
Next Story