Telugu Global
Andhra Pradesh

లోన్ యాప్ నిర్వాహ‌కుల దారుణం.. - యువ‌తి ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులు

నెల్లూరు జిల్లా సంగం మండలంలో నివాసం ఉండే యువతి వారం రోజుల క్రితం అత్యవసరంగా రూ.3 వేల న‌గ‌దు అవ‌స‌ర‌మై లోన్ యాప్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసింది.

లోన్ యాప్ నిర్వాహ‌కుల దారుణం.. - యువ‌తి ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులు
X

లోన్ యాప్ నిర్వాహ‌కులు మ‌రో దారుణానికి పాల్ప‌డ్డారు. తీసుకున్న రుణం చెల్లించిన‌ప్ప‌టికీ మ‌రింత బ‌కాయి ప‌డ్డారంటూ ఓ యువ‌తి ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి బెదిరింపుల‌కు దిగారు. మార్ఫింగ్ చేసిన ఫొటోల‌ను ఆ యువ‌తి కాంటాక్ట్ నంబ‌ర్‌కు పంపించి మాన‌సికంగా వేధింపుల‌కు గురిచేశారు. దిక్కుతోచ‌ని స్థితిలో బాధితురాలు దిశ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా సంగం మండలంలో నివాసం ఉండే యువతి వారం రోజుల క్రితం అత్యవసరంగా రూ.3 వేల న‌గ‌దు అవ‌స‌ర‌మై లోన్ యాప్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసింది. అనంత‌రం క్యాండీ క్యాష్, ఈజీ మనీ యాప్ లలో తన వివరాలను అప్‌లోడ్‌ చేసింది. ఆ రెండు యాప్ ల నుంచి రూ.3,700 న‌గ‌దు యువతి అకౌంట్ లో క్రెడిట్ అయ్యింది. మూడు రోజుల అనంత‌రం.. ఆ యువ‌తి బ‌కాయి సొమ్మును తిరిగి చెల్లించింది. అయినా ఇంకా బ‌కాయి ఉన్నారంటూ లోన్ యాప్ నిర్వాహ‌కుల నుంచి యువ‌తికి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. నగదు కట్టకపోతే యువ‌తి ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు తీస్తామని భయపెట్టారు.

ఈ క్ర‌మంలో యువ‌తి ఫోన్‌ను శుక్ర‌వారం హ్యాక్ చేసిన యాప్ నిర్వాహ‌కులు మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఆమె కాంటాక్టు నంబ‌ర్ల‌కు పంపించారు. దీంతో యువ‌తి దిక్కుతోచ‌ని స్థితిలో దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలో దిశ పోలీసులు లోన్ యాప్ నిర్వాహ‌కుల‌పై కేసు న‌మోదు చేయ‌డ‌మే గాక సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కూడా స‌మాచారం అందించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  30 July 2023 2:22 AM GMT
Next Story