Telugu Global
Andhra Pradesh

సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని.. - స్పీక‌ర్ త‌మ్మినేని

అన్ని రకాల సదుపాయాలూ ఉన్న విశాఖపట్ట‌ణాన్ని రాజధానిగా చేయడం వల్ల పెట్టుబడిదారులకు మెరుగైన అవకాశాలు కలుగుతాయ‌ని త‌మ్మినేని చెప్పారు. దీని వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో లాభం చేకూరుతుంద‌న్నారు.

సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని.. - స్పీక‌ర్ త‌మ్మినేని
X

సీఎం ఎక్కడ నుంచి ప‌రిపాల‌న చేస్తే అదే రాజధాని అవుతుందని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఢిల్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను ఏపీ ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయ‌న చెప్పారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ధ్యేయమని తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీ‌కాకుళంలోని ఆర్ అండ్ బీ కార్యాల‌యంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

అన్ని రకాల సదుపాయాలూ ఉన్న విశాఖపట్ట‌ణాన్ని రాజధానిగా చేయడం వల్ల పెట్టుబడిదారులకు మెరుగైన అవకాశాలు కలుగుతాయ‌ని త‌మ్మినేని చెప్పారు. దీని వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో లాభం చేకూరుతుంద‌న్నారు. వలసలను నివారించి, ఉపాధి అవకాశాలను కల్పించి, అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి మార్గం సుగమ‌మ‌వుతుందని తెలిపారు. సముద్ర, వాయు, రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉంటేనే అభివృద్ధి చెంద‌గ‌లం అనే అభిప్రాయంతో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ రాజధానిగా ఉండటం వల్ల సికింద్రాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ ఇలా చుట్టుప‌క్క‌ల‌ ప్రాంతాలైన అన్ని జిల్లాలూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని త‌మ్మినేని చెప్పారు. విశాఖకు రాజధాని వస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని ఆయ‌న వివ‌రించారు.

రాబోయే ఎన్నికలు పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య, కులాల మధ్య కాదని.. పెత్తందారులకు, పేద వర్గాలకు మధ్య ఎన్నికలని త‌మ్మినేని చెప్పారు. సామాజిక న్యాయంతో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ కు అన్ని వర్గాల వారు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతూల్యత దెబ్బతింటుందని చంద్రబాబు ఏ విధంగా అంటారని ఆయ‌న‌ ప్రశ్నించారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని సుప్రీంకోర్టు కొలీజియంకు చంద్రబాబు లేఖ రాశారని, అటువంటి నీచమైన నాయకుడైన నువ్వు వెనుకబడిన వర్గాలకు ఏమి న్యాయం చేస్తావని చంద్రబాబును ప్రశ్నించారు. దళితుల కోసం పోరాడతామని చెప్పుకునే కమ్యూనిస్టు పార్టీలు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఎందుకు వద్దని వారించాయ‌ని త‌మ్మినేని నిల‌దీశారు. మీ సిద్ధాంతాలు ఎక్కడికి పోయాయని కమ్యూనిస్టు పార్టీలను ఆయ‌న‌ ప్రశ్నించారు.

ఒంటరిగా ప్రజల పక్షాన నిలిచిన సీఎం జగన్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటు వేసి మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకోవాల‌ని సూచించారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, జ్యోతీరావుపూలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వారి పోరాటాల ఫ‌లాలు ప్రజలకు దక్కాలని సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.

First Published:  1 Feb 2023 11:32 AM GMT
Next Story