Telugu Global
Andhra Pradesh

వాలంటీర్లంతా ప్రభుత్వ ఉద్యోగులే..! త్వరలో ప్రకటన..!!

టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను పీకి పారేస్తామని చెబుతున్నారని, అలాంటి అవకాశం వారికి లేదని, వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా తమ ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు.

వాలంటీర్లంతా ప్రభుత్వ ఉద్యోగులే..! త్వరలో ప్రకటన..!!
X

ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని, గౌరవ వేతనం పెంచాలంటూ గ్రామ వార్డు వాలంటీర్లు కొంతకాలం క్రితం ఏపీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో వారి విషయంలో ఏమాత్రం సానుకూలంగా వ్యవహరించలేదు ప్రభుత్వం. సేవా రత్న, సేవా వజ్ర అనే అవార్డులిచ్చి సరిపెట్టారు, వాలంటీర్లను అలా సంతోష పెట్టారు. ఇప్పుడు వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి మారుతున్నట్టు తెలుస్తోంది. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అన్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.

టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను పీకి పారేస్తామని చెబుతున్నారని, అలాంటి అవకాశం వారికి లేదని, వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా తమ ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ఇది కేవలం వారి మెప్పుకోసం చెప్పారా, లేక ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందా అనేది తేలాల్సి ఉంది.

తొడగొట్టిన స్పీకర్..

శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లు, గ్రామ సచివాలయాల కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. వాలంటీర్ల సేవలను కొనియాడారు. మళ్లీ జగన్ కే ఓటు వేస్తామని గడప గడప కార్యక్రమంలో ఓ మహిళ తొడగొట్టి చెప్పిందని అన్నారు. ఆమెను అనుకరిస్తూ ఆయన కూడా ఆ సమావేశంలో తొడగొట్టారు. కన్వీనర్లు, వాలంటీర్ల సహకారంతో.. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారన్నారు. నారావారి పల్లెలో రెండెకరాల భూమి ఉన్న చంద్రబాబు ఇప్పుడు కోటీశ్వరుడు ఎలా అయ్యారని, ఆయన దగ్గర ఏమైనా మంత్ర దండం ఉందా..? అని ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే దాన్ని ప్రజలకు అందిస్తే నిరుపేదలంటూ భూమిమీద ఎవరూ ఉండరు కదా అన్నారు.

First Published:  1 Jan 2023 3:59 AM GMT
Next Story