Telugu Global
Andhra Pradesh

ఏపీ ముస్లింలు జగన్ వెంటే -అసదుద్దీన్ ఒవైసీ

ఏపీలో కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు కచ్చితంగా తీసేస్తారని, జగన్ గెలిస్తేనే ఏపీలో మళ్లీ లౌకిక ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. ఏపీలోని ముస్లింలు జగన్ కి మద్దతివ్వాలని కోరారు.

ఏపీ ముస్లింలు జగన్ వెంటే -అసదుద్దీన్ ఒవైసీ
X

ఏపీలో ముస్లింలందరూ ఏకపక్షంగా సీఎం జగన్ కి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కూటమికి ఓటు వేస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తారని హెచ్చరించారు. ఏపీలో జగన్ ఒక్కరే అసలైన లౌకిక వాది అని చెప్పారాయన. ముస్లింలంతా ఏపీలో వైసీపీకి ఓటు వేయాలని కోరారు అసదుద్దీన్ ఒవైసీ.

వైఎస్ఆర్ వల్లే రిజర్వేషన్లు..

దివంగత నేత వైఎస్ఆర్ వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని గుర్తు చేశారు అసదుద్దీన్ ఒవైసీ. 2004లో గులాంనబీ అజాద్‌ కాంగ్రెస్ పరిశీలకులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత యూనస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చిందని, ముస్లిం రిజర్వేషన్లకు రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ హామీ అమలు చేశారని చెప్పారు అసదుద్దీన్. కింది కోర్టులు అభ్యంతరాలు తెలిపినా సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వడంతో ముస్లింలకు మేలు జరిగిందని అన్నారు.

ముస్లిం రిజర్వేషన్ల వల్ల ఇప్పుడిప్పుడే యువతకు మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని, చాలామంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారని, ఇదంతా బీజేపీకి కంటగింపుగా మారిందని, అందుకే ఆ పార్టీ ముస్లిం రిజర్వేష్లను టార్గెట్ చేసిందని అన్నారు అసదుద్దీన్. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కి ముస్లింలు అంటే తీవ్రమైన ద్వేషం అని, 4శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబ్దిపొందడం వారికి మింగుడుపడటం లేదని చెప్పారు.

అవి మత రిజర్వేషన్లు కావు..

ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఇస్తున్నవి కావని, ముస్లింలలోని నిమ్న కులాల వారికి మాత్రమే అవి లభిస్తున్నాయని చెప్పారు అసదుద్దీన్. చంద్రబాబు ముస్లిం ద్రోహి అని, గతంలో కూడా ఆయన బీజేపీతో కలసి పనిచేశారన్నారు. ఏపీలో కూటమి కట్టిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముస్లింలకు శత్రువులు అని అన్నారు. చంద్రబాబు, పవన్‌.. బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారన్నారు. ముస్లింల తర్వాత వీరు దళిత రిజర్వేషన్లు కూడా తీసేస్తారని ఏపీ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు కచ్చితంగా తీసేస్తారని, జగన్ గెలిస్తేనే ఏపీలో లౌకిక ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. వైఎస్ఆర్ ముస్లిం రిజర్వేషన్లు తెచ్చారని, ఆయన తనయుడు జగన్.. ముస్లింలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఏపీలోని ముస్లింలు జగన్ కి మద్దతివ్వాలని కోరారు అసదుద్దీన్ ఒవైసీ.

First Published:  30 April 2024 4:06 AM GMT
Next Story